– వారికి బాకీ ఉన్న రూ. 1560 కోట్లను తక్షణమే చెల్లించాలి
– ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం పోరాటం తప్పదు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను మోసం చేసిందని, ఆటో డ్రైవర్లకు పెండింగ్‌లో ఉన్న రూ.1,560 కోట్ల బాకీని తక్షణమే చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుంటే హైదరాబాద్‌లో మహా ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఆటో డ్రైవర్ల ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఆటోడ్రైవర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒక్కొక్క ఆటో డ్రైవర్‌కు రెండేళ్లకు రూ.24,000 కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నదని, తాము ఆటో డ్రైవర్లకు బీమా కల్పిస్తే ఈ ప్రభుత్వం దాన్ని కూడా ఊడగొట్టిందని, అందుకే గతంలో 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇది ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. ఆటో అన్నలతో బీఆర్‌ఎస్‌కు ఉన్న అనుబంధం కొత్తది కాదన్నారు. ఉద్యమ సమయంలో, కేసీఆర్ ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేసినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో ఆటో డ్రైవర్లు కూడా ముందుండి పోరాడారని, తెలంగాణ కావాలే, అయి తీరాల అని ర్యాలీలు తీసి కేసీఆర్‌కు మద్దతుగా నిలబడ్డారని గుర్తుచేశారు.కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కార్మికుల పట్ల తన ప్రేమను చాటుకున్నారని తెలిపారు. కేవలం ఆటో అన్నలకే కాక రాష్ట్రంలోని సుమారు ఆరున్నర లక్షల నుంచి 7 లక్షల మంది ఆటో కార్మికులకు అడగకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పకుండానే రూ.5 లక్షల ప్రమాద బీమాను కల్పించారని వివరించారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడేనన్నారు. అలాగే డ్రైవర్లకు, గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన నాయకుడు, కార్మిక పక్షపాతి అని కూడా పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లతోపాటు, అసంఘటిత రంగంలోని దాదాపు పదమూడున్నర లక్షల మంది డ్రైవర్లకు (వ్యాన్లు, జీపులు, ట్రాక్టర్లు, టాక్సీలు, లారీలు) కూడా రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించారని గుర్తుచేశారు. సిరిసిల్ల జిల్లా కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమని, నేతన్నలు, కర్షకులు (రైతులు), ధార్మికులు ఇక్కడ పెద్ద ఎత్తున ఉంటారని వివరించారు.
రెండేళ్లలో కాంగ్రెస్ వైఫల్యం
రాష్ట్రంలో మార్పు,మార్పు అంటూ జరిగిన మోసం ఎలా ఉంటుందో రెండేళ్లలో ప్రజలకు అర్థమైందని కేటీఆర్ విమర్శించారు. రైతులు, యువత, మహిళలు సహా అందరినీ 420 హామీలు ఇచ్చి మోసం చేశారని. రైతు రుణ మాఫీ విషయంలో అబద్ధాలు చెబుతూ దేవుళ్లపై అబద్ధపు ఒట్లు పెడుతున్నారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వంలో మంచిగా దర్జాగా బతికిన ఆటో డ్రైవర్ మష్రత్ అలీ, నేడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీల వల్ల రెండు ఆటోలు అమ్ముకుని, కిరాయి ఆటో నడుపుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటో డ్రైవర్ల డిమాండ్లపై పోరాటం తప్పదు
ఆటో డ్రైవర్ల హక్కుల సాధనకు తాము అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి లోపు బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెట్టకుంటే ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో మహా ధర్నా చేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెసోడు ఊరికే ఇవ్వడు. గల్లా పట్టి అడిగితేనే ఇస్తాడు, అందుకే పోరాటం తప్పదని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఒక క్రెడిట్ సొసైటీ (కోఆపరేటివ్ సొసైటీ) గా ఏర్పడాలని వారికి సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




