– బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ధ్వంద్వ నీతిని అమలు చేస్తూ తడిగుడ్డతో బీసీల గొంతుకోసిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతోపాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మొదటినుంచి చెప్పిన కాంగ్రెస్ పార్టీ చివరికి చేతులెత్తేసి భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో జీవో నెం.46 తీసుకొచ్చి బీసీలను దగా చేస్తోందని, 42 శాతం కాదు, కనీసం 20 శాతం కూడా ఇవ్వకుండా 17 శాతం మాత్రమే కేటాయించడం బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు. కులగణన, సర్వేలు, కోటా కోసం నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, దిల్లీలో ధర్నాలు, ఆర్డినెన్స్‌లు, జీవోలు అంటూ వెనుకబడిన వర్గాలను మైమరిపించి, ఆశలు రేకెత్తించి చివరికి వెన్నుపోటు పొడిచిందన్నారు. కులగణన సర్వే పేరిట రూ.200 కోట్లు ఖర్చు చేశారు.. ఏమైంది? కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా వ్యవహరించారని నిలదీశారు. ఆనాడు మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నవి కాబట్టే బీసీల ఓట్ల కోసం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ప్రేరేపిస్తే, తెలంగాణలో కూడా బీసీ రిజర్వేషన్ల పేరిట హడావుడిగా, ఆశాస్త్రీయంగా సర్వేలు చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో బీసీలపట్ల కాంగ్రెస్ మోసపూరిత చర్యలకు ప్రభావితం కాకుండా, అక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారు.తెలంగాణలో కొంతమంది కాంగ్రెస్ మాటలు నమ్మి 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తారని రేవంత్ రెడ్డికి పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు. రేవంత్ గౌడ్ అన్నరు, రేవంత్ యాదవ్ అన్నరు.. రేవంత్ ముదిరాజ్ అన్నరు. ఇప్పుడు ఏమైంది? బీసీలను కాంగ్రెస్ దోఖా చేసిందని లక్ష్మణ్ ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





