– రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కెటిఅర్ విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: రాష్ట్రాన్ని అపవాదులకు గురి చేస్తే, దివాలా తీసిందని దుష్ప్రచారం చేస్తే నష్టపోయేది రాష్ట్రమేనని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక సంస్థలు స్పష్టంగా వివరించాయని, సోషియో ఎకనామిక్ సర్వే కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించి నిజాలను చెప్పిందని అన్నారు. స్టేట్ ఓన్డ్ టాక్స్ రెవెన్యూస్‌లో తమ ప్రభుత్వం దేశంలోనే ఉత్తమ స్థానంలో తెలంగాణను నిలబెట్టింది.. దర్జాగా ఉన్న రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాం.. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆదాయం అంచనాలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఉస్సేన్ బోల్ట్ లెక్క పరిగెత్తిన ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఎందుకు చతికిలపడింది.. ఆర్థిక చక్రం పూర్తిగా అపసవ్య దిశలో ఎందుకు తిరుగుతున్నదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. రెవెన్యూ మిగులు రాష్ట్రానికి ఎందుకు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తున్నదన్నారు. కరోనా కాలంలో మాత్రమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉందన్నారు. ఉన్న డే ఎకానమీని ఖరాబు చేసి నైట్ ఎకానమీ తీసుకువస్తాం అంటున్నారు.. మీరు తీసుకురానున్నది నైట్ ఎకానమీ కాదు.. దారం తెగిన తెలంగాణ కైట్ ఎకానమీ మాదిరిగా మార్చిర్రు. తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన నాయకత్వం కేసీఆర్‌ది. కానీ ఈరోజు రాష్ట్రం తలసరి ఆదాయంలో 6వ స్థానానికి పడిపోయిందన్నారు. రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, వెహికల్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, జీఎస్టీ గ్రోత్ తగ్గింది. మందగమనం మాత్రం బ్రహ్మాండంగా ఉందని ఎద్దేవా చేశారు. మార్కెట్లో జోరు లేదు, దుకాణాల్లో గిరాకీ లేదు, అంతా నెగటివ్ సెంటిమెంట్ అయిపోయిందన్నారు. సారా దుకాణాలు తెరవాలని డిమాండ్లు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా చూస్తున్నామన్నారు. ఒకప్పుడు నీరో చక్రవర్తి గురించి వింటే ఇప్పుడు జీరో చక్రవర్తిని చూస్తున్నామన్నారు. ప్రజల ఆస్తులను జీరో వాల్యూ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈయనేనన్నారు. ఆర్థిక వ్యవస్థ ఈ పరిస్థితికి రావడానికి నెగటివ్ మైండ్‌సెట్, నెగటివ్ పాలసీలే ప్రధాన కారణమని, టీ-హబ్‌ను సైతం చాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారో ఏమో తెలియదు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు అందులోకి తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రికి తెలియకుండా ఆర్డర్లు వస్తున్నాయి.
రాష్ట్రం వచ్చినాక ప్రజల ఆర్థిక స్తోమత భారీగా పెరిగింది.. కుటుంబ ఆదాయం పెరిగింది, కుటుంబ తలసరి ఆదాయంలో కూడా దేశంలోనే అత్యుత్తమ స్థానంలో ఉన్నది అంటే అది తెలంగాణ అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం ఈరోజు నాలుగైదు నెలలుగా నెగటివ్ ద్రవ్యోల్బణం చవిచూస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ ప్రచారాలు చేసిండ్రు. కేవలం పొలిటికల్ ప్రాపగాండా కోసం రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకుపోతున్నారు. గ్లోబల్ సమిట్ అని చెప్పి ఒక గోబెల్స్ కాన్ఫరెన్స్ పెట్టి 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రచారం చేసుకున్నారు. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పెట్టుబడుల నంబర్ రాసింది. రూ.100 కోట్ల టెంట్ వేసి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మలు చూపించి ప్రచారం చేసుకున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరి అందరినీ కోటీశ్వరులుగా చేస్తే కోటి ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రం అవుతుంది. ఎందుకు ఇలాంటి అసత్యాలు, ఆచరణ సాధ్యం కాని మాటల” చెబుతున్నారు? డావోస్‌తోపాటు మొన్న జరిగిన కాన్ఫరెన్స్ అన్నిటిపైన కలిపి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తాము ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాలను సేకరిస్తే అక్కడ పాదయాత్ర చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంలోకి రాకముందు ప్రజలకు తిరిగి ఇస్తామని చెప్పారు. ఈరోజు ప్రభుత్వం అక్కడ గ్రాఫిక్స్ మాయాజాలంతో ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి అబద్ధాలు చెప్తున్నది. ఫార్మా సిటీ భూసేకరణ కేవలం ఫార్మా అవసరాల కోసమే వాడుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ పక్కనపెట్టి కంపెనీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇండ్లు ఇస్తామని చెప్పి అందరినీ మోసం చేస్తున్నదని విమర్శించారు. కాలుష్యకారక పరిశ్రమలు వద్దు అని చెప్పి ఆరోజు పోరాటం చేసిన కాంగ్రెస్ నేతలు ఈరోజు మధ్యలో పరిశ్రమలు పెట్టి ఏవిధంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తారు అని నిలదీశారు. ఇన్ని అబద్ధాలు చెబితే పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు తుపాకీ పెట్టి బెదిరిస్తే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తారా అన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. గ్లోబల్ సమిట్ అని ఏర్పాటు చేసిన సమావేశంలోనే ప్రపంచంలోని అనేకమంది ఆర్థికవేత్తలు గత ప్రభుత్వం ఘనత గురించి చెప్పారన్నారు. తెలంగాణలో కేసీఆర్ పేరు లేకుండా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామంటే ఆ శక్తి ఎవరికీ లేదన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి 2024-25లో అంచనాల్లో సగం కూడా రాలేదని, 2023-24లో 14,295 కోట్లు వస్తే 2024-25 లో 8473 కోట్లకు పతనమైందని తెలిపారు. పదేండ్ల కాలంలో 25 శాతం సగటు గ్రోత్ రేటుతో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది రిజస్ట్రేషన్ ఆదాయం. ఇప్పుడంÔతా నేల చూపులు. గత ఏడాది షాక్ అంచనాలు తగ్గించి ఈసారి 19వేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు.. అందులో జనవరి నాటికి చేరుకున్నది 64 శాతమే.. కరోనా తర్వాత ఇది..సెకండ్ లోయస్ట్ అని కేటీఆర్ విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


