– మేడిగడ్డపై ఎన్డీఎస్‌ఏ నివేదిక బూటకం
– అది ఎన్‌డిఎ నివేదిక అంటూ విమర్శలు
– కెసిఆర్‌కు పేరు రావడం ఇష్టం లేకే కుట్రలు
– ఎక్స్ వేదికగా కెటిఆర్ ఆరోపణలు
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్‌ఏ (నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ) ఇచ్చిన నివేదికను ఎన్డీయే నివేదిక అనడంలో ఎలాంటి తప్పు లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. నాణ్యత లేనిది కాళేశ్వరం, మేడిగడ్డలో కాదని కేవలం కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న రాజకీయాలే నాణ్యతారహితంగా వున్నాయన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ నిలిచేది వాస్తవమే నన్నారు. అశాస్త్రీయ్ర ఆరోపణలను ఎల్ అండ్ టీ ఖండించండం సంతోషమన్నారు. కాళేశ్వరం ప్రపంచంలోని అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ అని, కేసీఆర్ దూరదృష్టి గల నాయకుడని కేటీఆర్ చెప్ప్పుకొచ్చారు. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్‌ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయింది. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్‌ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని రుజువైందన్నారు.
క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ ఏ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదే. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకుని, ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకూ రెండింటిలోనూ అడుగడుగునా పొంతనలేని అంశాలుండటం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టిందన్నారు. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్‌ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనమన్నారు. కేసీఆర్‌కు పేరొస్తుందన్న రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పక్కనపెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారని ఎక్స్‌లో కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొట్టి, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్ బీజేపీ, ఇటీవల బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణ నాణ్యత వరకూ అడుగడుగునా ఎక్కడా రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టుపై బురదజల్లడం మాని, ఇకనైనా ఎల్ అండ్ టీ అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డీఎస్‌ఏ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్డీఎస్‌ఏ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో దీన్ని కుంటిసాకుగా చూపి దాటవేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలి. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ బీజేపీల కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం’ అని ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ చేశారు.





