– కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు
– ఆయనపై దాడికి యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు
– రాష్ట్రంలో రౌడీ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం
– ఇరు పార్టీల నాయకుల మాటల యుద్ధం
– పోలీసుల జోక్యంతో సాధారణ స్థితి
సిద్దిపేట, ప్రజాతంత్ర,జనవరి 26 : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై చేసిన వ్యాఖ్యలు విమర్శలు ఘర్షణ వాతావరణానికి తీరలేపాయి. సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దుబ్బాక గాంధీ సెంటర్ వద్ద జెండాను ఎగురవేసిన అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పాలన పై సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలపై విమర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనను వదిలివేసారని రెండేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న అభివృద్ధి జరగలేదంటూ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కార్యక్రమం అనంతరం కారు వద్దకు వెళుతున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో వాగ్వివాదానికి దిగారు.కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కారును అడ్డుకునేందుకు యత్నించగా, అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుపడడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనతో గణతంత్ర దినోత్సవ వేడుకల వాతావరణం కాస్తా ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే పై దాడి చేసే ప్రయత్నం జరుగుతోందంటూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై దాడికి యత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, దుబ్బాకలో కూడా అదే తరహా చర్యలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించడమే నేరంగా మారిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడికి యత్నించిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుంటే చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వం పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతింప చేశారు.ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిర్భయంగా ఎండగడతామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
దుబ్బాకలో అభివృద్ధి పనులకు శ్రీకారం
నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి వివిధ గ్రామాల్లో భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అక్బర్‌పేట, రామేశ్వరంపల్లి, తాళ్లపల్లి, పోతిరెడ్డిపేట గ్రామాల్లోని జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అలాగే పోతిరెడ్డిపేట, అక్బర్‌పేట గ్రామాల్లో పాటిగడ్డ శివాలయాలు, మహిళా భవనాల నిర్మాణాలకు కూడా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా మౌలిక వసతులు, మహిళా సాధికారత, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు రాజకీయాలకు అతీతంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.అనంతరం ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చైర్మన్ వెంకటయ్యలను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రవి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


