దమ్ముంటే సహకార ఎన్నికలు నిర్వహించండి

– నామినేటెడ్‌ పద్దతిలో భర్తీకి సర్కారు యత్నం
– కృష్ణా జలాల్లో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
– సర్పంచ్‌ల సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌

నల్లగొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేయలేక, ప్రజలకు ముఖం చూపించలేక సహకార ఎన్నికల నిర్వహణ నుంచి తప్పించుకుంటోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లాలో సర్పంచులు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అర్జునుడు చిలుక కన్నును లక్ష్యంగా చేసుకున్నట్టు మన దృష్టి కూడా కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హావిూల అమలుపైనే ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు నిజంగానే మేలు చేసి ఉంటే సహకార ఎన్నికలు నిర్వహించేదని, కానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి భయంతో ఎన్నికలకు వెళ్లడంలేదని, నామినేటెడ్‌ పద్ధతిలో పదవులను భర్తీ చేస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. జెడ్పీ, మండల పరిషత్‌ ఎన్నికలను కూడా భయంతోనే వాయిదా వేస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయదారులు, కూలీలు ప్రభుత్వంపై తీవ్ర కోపంతో ఉన్నారని, ఆ ప్రభావం ఇప్పటికే సర్పంచ్‌ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పారు. రైతుబంధు, కౌలు రైతులకు ఆర్థిక సాయం, రైతు కూలీలకు నెలకు రూ.వెయ్యి భరోసా వంటి హావిూలను ప్రభుత్వం విస్మరించిందని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నిజాయతీ ఉంటే, రైతులకు మంచి చేశామన్న నమ్మకం ఉంటే సహకార ఎన్నికలు పెట్టాలని సవాల్‌ విసిరారు. సీఎం రేవంత్‌ కేవలం కాలక్షేప రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే కేసుల గురించి లీకులు ఇవ్వడం మానేసి ఏ కేసు పెడుతున్నారో చెప్పాలని సవాల్‌ విసిరారు. హోంమంత్రి కూడా ఆయనే కాబట్టి ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలని, శిఖండి రాజకీయాలు చేయడం తగదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌ కుమార్‌, భూపాల్‌ రెడ్డి, రవీంద్ర కుమార్‌ నాయక్‌, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. వీరితోపాటు మాజీ ఎంపీ లింగయ్య యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, నాయకులు చెరుకు సుధాకర్‌, ఒంటెద్దు నరసింహారెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

కృష్ణా జలాలపై సీఎం సహా మంత్రులకు జీరో నాలెడ్జ్‌

కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రుల అజ్ఞానంపై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నల్లగొండ జిల్లా వేదికగా సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ముఖ్యమంత్రికి నదీ జలాల అంశంపై ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు. ముఖ్యంగా సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నీళ్లపై కనీస అవగాహన లేదని విమర్శించారు. ఇటీవల జరిగిన విూడియా సమావేశంలో నీళ్ల గురించి అడిగిన ప్రశ్నలకు ’నేను సిద్ధమై రాలేదు.. రేపు వచ్చి సమాధానం చెప్తా’ అని అనడాన్ని ఆయన తప్పుబట్టారు. మరో మంత్రి గురించి చెబుతూ ’వాటర్‌లో నీళ్లు’ అని మాట్లాడే అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలు, సాగునీటి అవసరాలు తెలియని వాళ్లు అడ్డదారిలో అధికారంలోకి వచ్చి హూంకరిస్తున్నారని, అబద్దాలు చెప్పి గందరగోళం సృష్టించడం తప్ప వారికి ప్రజలపట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం కేసీఆర్‌ గర్జిస్తుంటే సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేస్తే మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తిచేయలేక ఈ రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీపీఆర్‌ పంపడంలో విఫలమవడమేకాక ప్రాజెక్టుల పరిధిని కుదిస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు గండికొడుతున్నారని విమర్శించారు. కేసులు పెట్టినా, జైలులో పెట్టినా నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *