గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలి

– ఆరోగ్యం-వ్యాధి, నివారణ–చికిత్స మధ్య కీలకం డయాగ్నస్టిక్స్
– విజయ మెడికల్ సెంటర్ కు డిప్యూటీ సీఎం భట్టి సూచ‌న‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సామాన్యుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా త‌మ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అదే త‌మ అజెండా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బేగంపేటలోని ఓ హోటల్లో సోమవారం నిర్వహించిన విజయ మెడికల్ సెంటర్ వైద్య సేవల ప్రారంభ కార్యక్రమంలో ఆయ‌న ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రెండవ శ్రేణి నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో డయాగ్నస్టిక్స్‌ సెంటర్స్ ప్రారంభించాలని విజయ మెడికల్ సెంటర్ నిర్ణయించడం అభినందనీయమ‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, అన్ని రకాల పరీక్షలు చేయాలని, అందుకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. కొన్ని దశాబ్దాల క్రితమే లేజర్ వైద్యం ద్వారా మ్యాక్సీ విజన్ కాసు ప్రసాద్ రెడ్డి తన జ్ఞానాన్ని సమాజానికి అందించార‌ని వివరించారు. సూర్యనారాయణ, ప్రసాద్ రెడ్డి, వేలు ముగ్గురూ బాల్య స్నేహితులని, కొన్ని దశాబ్దాలుగా కలిసి ఉండటమే కాదు విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తుండడం అభినందనీయమ‌ని అన్నారు. ప్రజారోగ్య వ్యవస్థలో కీలకమైన తొలి రక్షణ అడుగును బలోపేతం చేసే ప్రయత్నమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. డయాగ్నస్టిక్స్‌ విఫలమైతే మొత్తం వ్యవస్థే కూలిపోతుందన్నారు. ఆరోగ్యం లేకుండా గౌరవం ఉండదని, గౌరవం లేకుండా నిజమైన అభివృద్ధి సాధ్యం కాదని భట్టి స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ వెలుపల ప్రాంతాల్లో నాణ్యమైన డయాగ్నస్టిక్ సదుపాయాల విస్తరణ కీలకమన్నారు. డయాగ్నస్టిక్స్ ఆరోగ్యం-వ్యాధి మధ్య, నివారణ–చికిత్స మధ్య కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాలకు అధునాతన డయాగ్నస్టిక్ సదుపాయాలు చేరితే ప్రజలపై పడే ఆర్థిక, మానసిక భారం తగ్గుతుందన్నారు. ఆరోగ్య రంగంలో దూరం అనేది కేవలం కిలోమీటర్లలో కాదు.. ఆందోళన, ఆలస్యం, ఖర్చుల రూపంలో ఉంటుందని తెలిపారు. ఆధునిక వైద్యం ప్రారంభ దశలో వ్యాధి గుర్తింపుపై ఆధారపడి ఉంటుందని, విశ్వసనీయమైన డాటా లేకుండా ఆరోగ్య ప్రణాళికలు సాధ్యం కావ‌ని అన్నారు. ఆరోగ్యం కొందరికే పరిమితమైన హక్కు కాదని, ప్రజా సంపదగా ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. వ్యాధిని చికిత్స చేయడమే కాదు, ముందే అంచనా వేసే దిశగా ప్రభుత్వ విధానం ఉందన్నారు. న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్, విజయా మెడికల్ సెంటర్‌ల విస్తరణకు డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *