భూకంప ప్ర‌మాదాల‌పై ఆందోళ‌న‌

– వ‌రంగ‌ల్ జిల్లాలో ఆధునిక వ్య‌వ‌స్థ‌లు అవ‌స‌రం
– విప‌త్తు నిర్వ‌హ‌ణకు తీసుకున్న చ‌ర్య‌లేమిటి
– పార్ల‌మెంట్‌లో ఎంపీ కావ్య ప్ర‌స్తావ‌న‌

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 1: వరంగల్ జిల్లాలో శరవేగంగా విస్తరిస్తున్న పట్టణ విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి నేపథ్యంలో భూకంప సంబంధిత ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో ప్రస్తావించారు. వర్షాలు, ఉష్ణతరంగాలు, ఉరుములు–మెరుపులకు ముందస్తు హెచ్చరికలు అందించేందుకు ప్రత్యేక డాప్లర్ వెదర్ రాడార్ లేదా ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలపై వివరాలు కోరారు. అదేవిధంగా వరంగల్ వంటి ఉష్ణతరంగాలు, అనియంత్రిత వర్షాలకు గురయ్యే ప్రాంతాల్లో వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యం (క్లైమేట్ రెసిలియన్స్) పెంపు, విపత్తు నిర్వహణ చర్యలపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించాలన్నారు. భూకంప పరిశీలనా కేంద్రాలు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు, వాతావరణ పరిశోధన కేంద్రాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం అవసరమని సూచించారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వరంగల్ జిల్లా సీస్మిక్ జోన్-2 (తక్కువ ప్రమాద స్థాయి)లో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో మైక్రోజోనేషన్ అధ్యయనాలు ఇప్పటివరకు చేపట్టలేదని తెలిపారు. ప్రస్తుతం ఐదు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. వరంగల్‌కు ప్రత్యేక డాప్లర్ వెదర్ రాడార్ ఏర్పాటు ప్రణాళికలో లేదని, హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాల్లో ఉన్న ఎస్-బ్యాండ్ రాడార్లు పూర్తి కవరేజ్ ఇస్తున్నాయని పేర్కొన్నారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేస్తూ నౌకాస్ట్‌లు, మొబైల్ యాప్‌లు, అలర్ట్‌ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నామని తెలిపారు. అయితే వరంగల్ జిల్లాలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక డాప్లర్ వెదర్ రాడార్ ఏర్పాటు, అదనపు భూకంప పరిశీలనా కేంద్రాలు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల విస్తరణ, వాతావరణ పరిశోధన కేంద్రాల ఏర్పాటు చేయాలని కావ్య కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి ఈ మౌలిక వసతులను త్వరితగతిన అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *