సమగ్ర సంక్షేమ బడ్జెట్‌

– మంత్రి సీతక్క హర్షం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ప్రజల అవసరాలను అర్థం చేసుకుని రూపొందించిన సమగ్ర సంక్షేమ బడ్జెట్‌గా నిలిచిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా కీలకంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో రూపుదిద్దుకున్నదిగా పేర్కొన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రజాకర్షక బడ్జెట్‌గా అభివర్ణించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనంతరం ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. గ్రామీణాభివృద్ధికి వెన్నెముకగా నిలిచే పంచాయతీరాజ్ శాఖకు అత్యధిక కేటాయింపులు చేయడం ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం అయిందన్నారు. సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రెండు లక్షల కొత్త పెన్షన్ల మంజూరు నిర్ణయం ఎంతో హర్షణీయమన్నారు. దీని ద్వారా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలలు వంటి బలహీనవర్గాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇది ఆర్థిక సహాయం మాత్రమే కాక వారి గౌరవప్రద జీవనానికి ప్రభుత్వం ఇస్తున్న హామీగా భావించాలన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు భద్రత కల్పించడం ఒక చరిత్రాత్మక నిర్ణయమని సీతక్క అన్నారు. ప్రమాదవశాత్తు కుటుంబంలో ప్రధాన ఆదారాన్ని కోల్పోయిన సందర్భాల్లో ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలుకాకుండా ఉండేందుకు ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తోందని వివరించారు. ఈ పథకం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు భరోసా, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పారు. విద్యారంగంపై కూడా ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయడం ఎంతో గొప్ప నిర్ణయమని కొనియాడారు. ఇది విద్యార్థుల ఆరోగ్యం, హాజరు శాతం, చదువుపై దృష్టి పెంపునకు తోడ్పడుతుందని చెప్పారు. పేద కుటుంబాల విద్యార్థులు ఆకలితో పాఠశాలకు రావాల్సిన పరిస్థితి తొలగిపోతుందని, సమాన అవకాశాల దిశగా ఇది కీలక అడుగని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *