– రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తం
– కొండాపూర్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన
– మీడియాతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను తక్షణమే హాస్పిటల్స్‌కు తరలించి వారి ప్రాణాలు కాపాడేలా ప్రభుత్వం సమగ్ర ట్రామా కేర్ పాలసీని ప్రారంభించిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి అవసరమైన అన్ని వసతులతో 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొండాపూర్‌లో వంద పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి గురువారం శంకుస్థాపన చేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదం, ఇతర అత్యవసర పరిస్థితి ఏర్పడిన పది నిమిషాల లోపలే ఘటనా స్థలానికి చేరుకునేలా ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ఇందులో భాగంగా 108-అంబులెన్స్‌ల సంఖ్య పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 31 క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, జగిత్యాల్, సంగారెడ్డి, నారాయణపేట్, ఆదిలాబాద్‌లో క్రిటికల్ కేర్ బ్లాకులను ఇప్పటికే ప్రారంభించామని అన్నారు. మరో 21 సీసీబీల నిర్మాణం కొనసాగుతోందని, వీటన్నిటినీ ఈ ఏడాది చివరికి అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. కొండాపూర్‌లో రూ.41 కోట్లతో వంద బెడ్ల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశామని, వీలైనంత వేగంగా నిర్మాణం పూర్తి చేసి అత్యాధునిక వసతులతో వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఐటీ కారిడార్‌లో సెడంటరీ లైఫ్ స్టైల్ కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్నారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లో ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని, ఇక్కడ నివసించే ప్రజలకు ఈ క్రిటికల్ కేర్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి దామోదర్ తెలిపారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




