– పలు కీలక శాఖలతో మంత్రి సీతక్క విస్తృత సమీక్ష
– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మరిన్ని వరాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: మహిళా భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాక మౌలిక వసతులు, సాంకేతికత, అవగాహన, పర్యవేక్షణ, బాధ్యతాయుత పరిపాలనల సమన్వయంతో చూడాల్సిన అవసరం ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మహిళల రక్షణ కోసం విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థల్లో, కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ)లకు తప్పనిసరి ఆడిట్ వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. మహిళల భద్రత, సంక్షేమం, సాధికారత కోసం అవలంబించాల్సిన నూతన విధానాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి కూడా అయిన మంత్రి సీతక్క పలు కీలక శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర సచివాలయంలో సోమవారం విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పలు అంశాలపై చర్చించారు. ఇప్పటికే అమలులో ఉన్న షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సైబర్ క్రైమ్ నియంత్రణ చర్యలు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ విద్యాసంస్థలు, హాస్టళ్లు, కార్యాలయాలు, రాత్రివేళల ప్రయాణాలు, డిజిటల్ వేదికలు, అసంఘటిత రంగం వంటి విభిన్న రంగాల్లో ఇంకా వ్యవస్థాపరమైన లోపాలున్నాయని సమావేశం అభిప్రాయపడింది. వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
జీపీఎస్ అనుసంధానిత సురక్షిత రవాణా విధానం ఉండాలి 
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాత్రి 8 గంటల తర్వాత మహిళా ఉద్యోగులకు జీపీఎస్ అనుసంధానిత సురక్షిత రవాణా విధానం ఉండాలని సూచించారు. అసంఘటితరంగ మహిళల కోసం ప్రత్యేక నమోదు, గుర్తింపు కార్డు, ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ప్రజా రవాణాలో సీసీటీవీ పర్యవేక్షణను బలోపేతం చేసి పీక్ అవర్స్‌లో భద్రతా ఆడిట్లు నిర్వహించాలని నిర్దేశించారు. సైబర్ మార్ఫింగ్, స్టాకింగ్, బ్లాక్‌మెయిల్ వంటి నేరాలపై వేగంగా స్పందించడంతోపాటు బాధితులకు కౌన్సెలింగ్ కల్పించాలని, వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగ మహిళల రక్షణకు ప్రత్యేక విధానాలు రూపొందించాలని అన్నారు. గృహ హింస కారణంగా ఒంటరిగా మిగిలిన మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఆశ్రయ గృహాలు, హాస్టళ్ల భద్రతపై డిజిటల్ పర్యవేక్షణ ప్రొటోకాల్ అమలు చేయాలని ఆదేశించారు. హెం, మహిళా శిశు సంక్షేమ, విద్య, కార్మిక, రవాణా, మున్సిపల్ పరిపాలన, ఐటి, ఆరోగ్య శాఖల సమన్వయంతో రాష్ట్రస్థాయి మహిళా భద్రత కన్వర్జెన్స్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులందరికీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ సిద్దం చేయాలని, ప్రైవేటు రంగంలోని మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ చట్టపరమైన రక్షణతో అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. లైంగిక వేధింపుల కేసుల పురోగతిపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లలో చేరిక ప్రక్రియను ప్రభుత్వ యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు మహిళా సాధికారతకు అవసరమైన పలు కీలక పథకాలను రూపొందించి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. సమవేశంలోనే మహిళలకు వచ్చే ఆర్దిక సంవత్సరంలో ఇవ్వాల్సిన ఇందిరమ్మ మహిళా శక్తి యూపిఫాం చీరల డిజైన్లను మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ పరిశీలించారు. డిజైన్లలో మార్పులను సూచించారు. కోటిమంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను వచ్చే ఆర్దిక సంవత్సరంలో కూడా పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. సమావేశానికి ఉన్నతాధికారులు సంజయ్ కుమార్, శికా గోయల్, క్రిస్టినా చోంగ్తు, అనితా రామచంద్రన్, ప్రియాంకా వర్గీస్, శృతి ఓజా, దివ్యా దేవరాజన్ తదితరులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





