పూర్త‌యిన మేడారం గ‌ద్దెల ప‌నులు

– 19న ముఖ్య‌మంత్రి చేతుల‌ మీదుగా ప్రారంభం
– వ‌రంగ‌ల్ అభివృద్ధికి వారంలోగా టెండ‌ర్లు
– స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు చ‌ర్య‌లు
– మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి హౌసింగ్ బోర్డు ద్వారా ఇళ్ల నిర్మాణం
– మంత్రి పొంగులేటి 

వ‌రంగ‌ల్/హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7 : సుమారు రూ.300 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన‌ చ‌రిత్ర క‌లిగిన స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ గ‌ద్దెల ఆధునికీక‌ర‌ణ ప‌నులు 95 శాతం పూర్త‌య్యాయ‌ని రెవెన్యూ, స‌మాచార, పౌర‌సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 19న వాటిని ప్రారంభిస్తార‌ని తెలిపారు. ఉమ్మ‌డి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో చేప‌డుతున్న ప్ర‌గ‌తి ప‌నులు, మేడారం జాత‌ర ఏర్పాట్ల‌పై ఆయ‌న పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌, సీఎం స‌ల‌హాదారు వేం న‌రేందర్ రెడ్డిల‌తో క‌లిసి బుధ‌వారం స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా పొంగులేటి మాట్లాడుతూ వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్దికి సంబంధించి ముఖ్య‌మంత్రి ప్రత్యేకంగా రూ.4వేల కోట్లు మంజూరు చేసిన‌ట్టు తెలిపారు. ద‌శ‌ల వారీగా చేప‌ట్టే కార్య‌క్ర‌మాల్లో భాగంగా కోర్ అర్బ‌న్ ప్రాంతాల్లోని వ‌ర‌ద తాకిడికి గురైన  ప్ర‌జ‌ల‌కు తొలుత సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు నిర్ణ‌యించామ‌న్నారు. ఇక్క‌డ తొలుత  డ్రైనేజీ ప‌నులు చేప‌డ‌తామ‌ని, సుమారు రూ.570 కోట్లతో చేప‌ట్టే  మౌలిక స‌దుపాయ‌ల‌ కోసం కూడా మ‌రో వారం రోజుల్లో టెండ‌ర్లు పిలుస్తామ‌ని చెప్పారు. తాగునీటి స‌దుపాయాల విస్త‌ర‌ణ‌కు కూడా టెండ‌ర్లు ఆహ్వానిస్తామ‌న్నారు.

కేపీహెచ్‌బీ త‌ర‌హాలో ఇండ్లు నిర్మించాలి

ఇందిర‌మ్మ ఇండ్లు, 2 బిహెచ్‌కె ఇండ్ల మంజూరుతోపాటు మ‌ధ్య త‌ర‌గ‌తి, మ‌రీ అత్య‌ల్ప ఆదాయం గ‌ల మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారి కోసం యుద్ద‌ప్రాతిప‌దిక‌న హౌసింగ్ బోర్డు త‌ర‌పున కూక‌ట్‌ప‌ల్లి హౌసింగ్ బోర్డు త‌ర‌హాలో ఇండ్లు క‌ట్టించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. వ‌రంగ‌ల్ ఇన్న‌ర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేక‌ర‌ణ త్వ‌ర‌లో పూర్తిచేసేలా ఆదేశాలిచ్చామ‌న్నారు. భ‌ద్ర‌కాళి ఆల‌య మాడ‌ వీధుల ప‌నులు, చెరువు పూడికతీత‌, ఇత‌ర పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులకు వర్షాల కార‌ణంగా అంత‌రాయం క‌లిగిందని  చెప్పారు. ఈ పనుల పూర్తి కోసం ప్ర‌త్యేక ఆదేశాలు ఇస్తున్నామ‌న్నారు. హైద‌రాబాద్ త‌ర్వాత వ‌రంగ‌ల్ ను రెండ‌వ రాజ‌ధానిగా మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తూ కాక‌తీయ టెక్స‌టైల్ పార్క్‌ను పున‌రుద్ద‌రించేందుకు ఆదేశించామ‌న్నారు. సుమారు రూ.1100  కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్న 24 అంత‌స్ధుల ఆసుప‌త్రి నిర్మాణాన్ని త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసి ఏప్రిల్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా ప్రారంభించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. వ‌రంగ‌ల్ ను హెల్త్ సిటీగా మార్చాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోందని తెలిపారు. విమానాశ్ర‌యం ఏర్పాటుకు సంబంధించి భూసేక‌ర‌ణ పూర్తి చేసిన క‌లెక్ట‌ర్‌, ఇత‌ర అధికారుల‌ను అభినందిస్తున్నానన్నారు. వ‌రంగ‌ల్‌లో క్రీడా స్టేడియం, ప్ర‌త్యేకంగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు కోసం డిపీఆర్‌ను రూపొందించాల‌ని ఆదేశించామ‌న్నారు. సుమారు 200 సంవ‌త్స‌రాల వ‌ర‌కు చెక్కుచెద‌రని రీతిలో రాతి కట్ట‌డాల‌తో మేడారం అభివృద్ది ప‌నులు చేప‌ట్టామ‌న్నారు. రాష్ట్రం నుంచే కాక‌ గిరిజ‌న, గిరిజ‌నేత‌రులు, వివిధ రాష్ట్రాల నుంచి జాత‌ర‌కు వ‌చ్చే వారి కోసం భారీ ఏర్పాట్లు చేశామ‌ని మంత్రి పొంగులేటి వివ‌రించారు.

అవాకులు చ‌వాకులు పేలుతున్న కేటీఆర్ 

ఉమ్మ‌డి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుల అభినందన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్రాన్ని పందికొక్కులుగా దోచుకున్న మాజీ మంత్రి అవాకులు చ‌వాకులు పేలుతున్నారంటూ ముందు ఇంట గెలిచి రచ్చ గెలువు కేటీఆర్ అని హిత‌వు ప‌లికారు..అసెంబ్లీ సాక్షిగా మీ కుటుంబ సభ్యులే మీ బాగోతం బయటపెడుతుంటే అది సక్కదిద్దుకో చేతకాక పొంకనాలు కొడతున్నావా అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడానికి..బీఆర్ఎస్ నుఅడుగడుగునా బొందపెట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఉప ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి రెఫరెండం అన్నావు.. జూబ్లీహిల్స్ ప్రజలు మీ పార్టీని గూబ గుయ్యిమనిపించి కాంగ్రెస్ అభ్యర్థిని 24వేల ఓట్ల భారీ మెజారిటీ తో గెలిపించారు.. సర్పంచ్ ఎలక్షన్లలో మా సత్తా ఏంటో తెలుస్తదన్నావు.. రాష్ట్రం అంతటా ప్రజలు 70 శాతం కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన సర్పంచులను గెలిపించి మీకు వాత పెట్టారన్నారు. మళ్లీ మున్సిపల్ ఎన్నికలు సెమీఫైనల్స్ అని ప్రగల్భాలు పలుకుతున్నడు.. పగటికలలు కంటున్నాడు అని కేటీఆర్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *