హాస్టళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయండి

– మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు క్లియర్ చేస్తాం
– ఉపాధి హామీ కింద మెడిసినల్ ప్లాంట్స్ పెంచాలి
– పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు అడవిని కాపాడతారు
– వారసత్వంగా ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయండి
– ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19: సంక్షేమ వసతి గృహాల కోసం నిర్మిస్తున్న భవనాల్లో 80 శాతం పూర్తయిన వాటిని యుద్ద ప్రాతిపదికన మూడు నెలల్లో పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయా సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను శనివారం సమీక్షించారు. తదుపరి వైద్య, ఆరోగ్య శాఖ, దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకొకసారి క్రమం తప్పకుండా ఆర్థిక శాఖకు వచ్చే విధంగా ఒక సీనియర్ అధికారిని నియమించి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఈ వేసవిలో వసతి గృహాల మరమ్మతు కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశిస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. సంక్షేమ వసతి గృహాల అద్దెలు, విద్యుత్ బిల్లులు, కాస్మెటిక్ చార్జీలు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు ప్రతినెలా చెల్లిస్తామని, సంక్షేమ శాఖ అధికారులు సకాలంలో ఆర్థిక శాఖకు బిల్లులు పంపాలని డిప్యూటీ సీఎం సూచించారు. గత ప్రభుత్వ కాలంలో ఈ బిల్లులు ఏడు నెలలకొకసారి చెల్లించేవారని గుర్తు చేశారు. వసతి గృహాలకు సరఫరా చేస్తున్న మెటీరియల్ క్వాలిటీ చెక్ కోసం ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని నిరంతరం సమీక్షించాలన్నారు. డైట్ చార్జీలు 40 శాతం, కాస్మెటిక్ చార్జీలు 200 శాతం పెంచాం.. సంక్షేమ వసతి గృహాలకు సంబంధించిన బిల్లులను మొదటి ప్రాధాన్యతగా గుర్తించి చెల్లిస్తున్నాం.. ఈ క్రమంలో సంబంధిత అధికారులు నిత్యం వసతి గృహాలను సందర్శించి స్థానికంగా జరుగుతున్న బోధన, భోజనంలో నాణ్యత, వసతి సదుపాయాలను పరిశీలించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రపంచం మొత్తం ఆయుర్వేదం వైపు చూస్తున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో మెడిసినల్ ప్లాంట్లు పెంచేందుకు ఆయుష్ శాఖ ఏర్పాట్లు చేసుకోవాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ సమావేశంలో డిప్యూటీ సీఎం సూచించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక ప్రజలు అడవిని కాపాడుకుంటారని అటవీ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. పర్యాటక రంగం విస్తరిస్తే స్థానిక ప్రజలకు ఉపాధితోపాటు ఆదాయం సమకూరుతుందన్నారు. కాలుష్య కారకాలు, వాటిని నియంత్రించకపోతే వచ్చే ప్రమాదాలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న దేవాలయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని దేవాదాయ శాఖ సమావేశం లో డిప్యూటీ సీఎం సూచించారు. సమావేశాల్లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు సబ్య సాచి గోష్, కృష్ణ ఆదిత్య, క్రిస్టినా, సువర్ణ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *