– అంగన్‌వాడీలకు ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో..
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : కొన్ని రోజులుగా రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ అధికారిక, అనుబంధ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అసత్య ప్రచారాన్ని నిర్వహిస్తున్నారంటూ అంబర్‌పేటకు చెందిన పాండు నాయక్ అనే వ్యక్తి సైబరాబాద్/హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం అధికారికి ఫిర్యాదు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సెల్‌ఫోన్ల కొనుగోలు విషయంపై మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టంగా రూ.11,650కు కొనుగోలు చేసినట్లు వెల్లడించినప్పటికీ దానిని కావాలనే రూ.14,499కు కొనుగోలు చేసినట్లు, సుమారు రూ.30 కోట్ల అవినీతి జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ అసత్య సమాచారాన్ని ‘ఎక్స్’, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా వ్యాప్తిచేస్తున్నారని ఆరోపించారు. సెల్‌ఫోన్ ధరలను వారే పెంచేసి అంగన్‌వాడీ కేంద్రాలకు సెల్‌ఫోన్ల పంపిణీలో కుంభకోణం జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్రైస్ (జెమ్) ద్వారా కేంద్ర ప్రతినిధులు, ఐఏఎస్ అధికారుల కమిటీ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ప్రక్రియను మంత్రికి ముడిపెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఒక ఆదివాసీ గిరిజన మహిళ రాష్ట్ర మంత్రిగా ఉన్నత స్థానంలో ఉండటాన్ని సహించలేక ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వ పారదర్శక నిర్ణయాలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజల్లో అపోహలు రేకెత్తించడం, మంత్రి పట్ల ద్వేషాన్ని పెంచడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. ఒక ఆదివాసీ గిరిజన మహిళా మంత్రిపై ఇలాంటి దాడులు చేయడం చఐటీ చట్టం 2000 (సెక్షన్స్ 66 సీ, 67) భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) ప్రకారం తీవ్రమైన నేరం. కావున, ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని పాండు నాయక్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




