పురోగతి లేని ఆయిల్ పామ్ కంపెనీల జోన్ల రద్దు

– వాటిని ఆయిల్ ఫెడ్ కు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3ః రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి కోసం కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో ఒప్పంద నిబంధనల ప్రకారం పురోగతి సాధించని కంపెనీలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు వ్యవసాయశాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. పురోగతి లేని ఆయిల్ పామ్ కంపెనీలకు కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లను తగ్గిస్తూ ఆయా ప్రాంతాలను తెలంగాణ ఆయిల్ ఫెడ్ కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ఆయిల్ పామ్ (ఉత్పత్తి, ప్రాసెసింగ్ నియంత్రణ) చట్టం 1993, నిబంధనలు–2008 ప్రకారం ఆయిల్ పామ్ కంపెనీలు రైతు నాట్ల నుండి 36 నెలల్లోపు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఫ్యాక్టరీ జోన్ పరిధిలో రైతులకు సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే పలు కంపెనీలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, నాట్ల విస్తరణ, నర్సరీ అభివృద్ధి వంటి అంశాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి పలుమార్లు సమీక్షలు నిర్వహించినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు కరీంనగర్ జిల్లాలో కేటాయించిన 44,527 ఎకరాలకు 6721 ఎకరాలలో మాత్రమే ఆయిల్ పామ్ సాగులోకి తెచ్చినందున కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఫ్యాక్టరీ జోన్‌ను రద్దు చేసి ఆయిల్ ఫెడ్‌కు కేటాయించారు. మ్యాట్రిక్స్ పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కేటాయించిన 30,552 ఎకరాలకు కేవలం 1606 ఎకరాలు, అదేవిధంగా కేఎన్ బయోసైన్సెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కు హన్మకొండలోని 9 మండలాలు, వరంగల్ జిల్లాలలోని 2 మండలాలు కలిపి 14000 ఎకరాలు లక్ష్యం ఇవ్వగా 2136 ఎకరాలను మాత్రమే సాగులోకి తెచ్చారు. దీంతో ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వారికి ఆయా జిల్లాలలో కేటయించిన ఫ్యాక్టరీ జోన్లను పూర్తిగా రద్దు చేస్తూ ఆ ప్రాంతాలను ఆయిల్ ఫెడ్‌కు కేటాయించారు. రైతులకు సమయానికి గెలల కొనుగోలు, స్థిరమైన ధర, సమీపంలో ప్రాసెసింగ్ మిల్లుల లభ్యత వంటి అంశాలు అత్యంత కీలకమని మంత్రి పలుమార్లు తెలిపారు. పురోగతి లేని కంపెనీల వద్ద ఫ్యాక్టరీ జోన్లు కొనసాగించడం వల్ల రైతులు నష్టపోతారన్న ఉద్దేశంతో ఆయిల్ ఫెడ్‌కు ఈ జోన్లను కేటాయించే విషయమై పరిశీలించాల్సిందిగా సెక్రటరీని ఆదేశించారు. ప్రభుత్వం పంటల మార్పిడి అవసరాన్ని తెలియజేసేలా, వంట నూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఆయిల్ పామ్ సాగును వ్యూహాత్మకంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (ఎన్ ఈవో- ఓపీ) కింద రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ప్రభుత్వం అమలు చేస్తున్న‌ట్లు వ్యవసాయ శాఖ కార్య‌ద‌ర్శి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 2.82 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 98,976 ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చింది. 53,709 మంది రైతులకు రూ.297.88 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటికే జమ చేసింది. వ్య‌వ‌సాయ మంత్రి చొరవతో రాష్ట్రంలో ఆయిల్ ఉత్పత్తి శాతం 20.01% తో దేశంలోనే అత్యధికంగా ఉంది. ముడి పామ్ ఆయిల్ ఉత్పత్తి సుమారు 70,000 టన్నులు కాగా, ప్రస్తుతం గెలల ధర మెట్రిక్ టన్నుకు రూ.19,694గా ఉందని తెలిపారు. కంపెనీలు ప్రణాళిక ప్రకారం పని చేసి, రైతుల నమ్మకాన్ని పెంచాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల అధికారులకు దిశానిర్దేశం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *