– అత్యధిక స్థానాలతో ముందంజలో సిపిఐ
– హంగ్ ఏర్పడడంతో క్యాంప్ రాజకీయాలు మొదలు
భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా, కొత్తగూడెం కార్పొరేషన్‌లో మాత్రం సీపీఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు వేడెక్కాయి. మొత్తం 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ మిత్రపక్షాలతో కలిసి 25 స్థానాల్లో విజయం సాధించి ముందంజలో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ 21 డివిజన్లను కైవసం చేసుకోగా, బీఆర్‌ఎస్ 9 స్థానాల్లో గెలుపొంది కింగ్ మేకర్‌గా మారింది. బీజేపీ, సీపీఎం తలో స్థానాన్ని గెలుచుకోగా, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్రులలో ముగ్గురు ఇప్పటికే సీపీఐకి మద్దతు ప్రకటించే అవకాశం ఉండటంతో ఎర్రజెండా పీఠం ఎక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. తమ అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు సీపీఐ ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. మరోవైపు, బీఆర్‌ఎస్ గెలిచిన 9 స్థానాలు ఇక్కడ అత్యంత కీలకం కానున్నాయి. కాంగ్రెస్‌తో ఉన్న విభేదాల దృష్ట్యా బీఆర్‌ఎస్ శ్రేణులు సీపీఐకి మద్దతు ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. పాల్వంచ మున్సిపాలిటీని కొత్తగూడెంలో విలీనం చేసిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో ఈ విజయం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ విజయాలను నమోదు చేసింది. అయితే ఫలితాల వెల్లడి సమయంలో కొన్ని చోట్ల రీకౌంటింగ్ వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కేవలం 3 ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయిన చోట రీకౌంటింగ్ నిర్వహిస్తూ, తమకు అవకాశం ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వైరా, సత్తుపల్లి, కల్లూరులో కూడా ఇదే తరహా వివాదాలు కొనసాగుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




