– పర్యవేక్షణకు రాజ్‌నాథ్ నేతృత్వంలో కమిటీ
– పెట్రో ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం
– పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.10 తగ్గిస్తూ ఆదేశం
న్యూదిల్లీ, మార్చి 27: పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్, క్రూడాయిల్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి సభ్యులుగా ఉంటారు. మరోవైపు సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను కేంద్రం తగ్గించింది. పెట్రోల్‌పై సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కు తగ్గించింది. లీటరుకు రూ.10గా ఉన్న డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలు, మధ్యప్రాచ్య దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అవాంతరాలు తలెత్తుతున్నాయి. పెరిగిన దిగుమతి వ్యయాన్ని తట్టుకుని చమురు సంస్థల రికవరీకి తాజాగా కేంద్రం తీసుకున్న చర్య ఉపయోగపడుతుంది. మరోవైపు, దేశవ్యాప్తంగా రిటైల్ ఔట్‌లెట్స్ యథాప్రకారం పనిచేస్తున్నాయని, అన్ని పంపుల్లోనూ తగినన్ని పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వదంతులు నమ్మవద్దని, ప్యానిక్ కొనుగోళ్లకు పాల్పడవద్దని వినియోగదారులను కోరింది. దేశంలో ఇంధన కొరతను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ ల ఎగుమతిపై సుంకాన్ని విధించింది. వీటి ధరలను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తామని తెలిపింది. ఈమేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ఛైర్మన్ వివేక్ చతుర్వేది ప్రకటన చేశారు. యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం, ముడి చమురు ధరల పెరుగుదలతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయన్నారు. వీటిని పూడ్చడానికే పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ డ్యూటీల్లో కోత విధించామన్నారు. వీటివల్ల వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరనప్పటికీ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఊరట లభించనుందన్నారు. ఈ చర్యల వల్ల వచ్చే పదిహేను రోజుల్లో రూ. 7 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందన్నారు. మరోవైపు ఎగుమతులను అరికట్టడానికి డీజిల్, ఏటీఎఫ్‌లపై అదనపు సుంకాలను విధించామని సీబీఐటీ ఛైర్మన్ పేర్కొన్నారు. వీటి వల్ల వచ్చే పదిహేను రోజుల్లో ప్రభుత్వానికి రూ.1500 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. దేశీయంగా డీజిల్, ఏటీఫ్‌లు అందుబాటులో ఉంచడానికే ఈ చర్యలు తీసుకున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





