-ఇఫ్తార్ వేడుకలు సామరస్యానికి నిదర్శనం
– మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణ, సహనం, సేవాభావం, మానవత్వానికి ప్రతీకమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యుజె), తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీయూడబ్ల్యుజేఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో అట్టడుగు వర్గాల గొంతుకగా నిలిచే జర్నలిస్టులు కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారు వారధిలా పనిచేస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ విషయంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అలాగే ఇళ్ల స్థలాల కేటాయింపు, హెల్త్ కార్డుల మంజూరు వంటి అంశాల్లో కూడా సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో కానీ అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటులో కానీ జర్నలిస్టుల అందరి సలహాలు సూచనలు తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, సుల్తాన్ ఉల్ ఉలూమ్ విద్యాసంస్థల సెక్రటరీ జఫర్ జావేద్, పిస్తా హౌస్ సీఈఓ ఎం.ఏ. మజీద్, టీయూడబ్ల్యూజే అధ్యక్షులు కె. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రామనారాయణ, టీయూడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు ఎం.ఏ. మజీద్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





