ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేలకు సీఎం హామీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క నేతృత్వంలో గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి పలు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ  ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణంపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. వీటి ద్వారా తాగు, సాగు నీటి అవసరాలను తీర్చవచ్చుననిన్నారు. చెక్ డ్యాంలు, రహదారుల నిర్మాణం కోసం అటవీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చేలా చూస్తానన్నారు. ఆదివాసీ, గిరిజన రైతులు సాగు చేస్తున్న భూముల్లో బోర్లు వేయడానికి అనుమతులు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అటవీ శాఖ అభ్యంతరాల వల్ల రహదారుల మరమ్మతులు ఆలస్యం అవుతున్నాయని, కొన్నిచోట్ల కొత్త రహదారులకు అనుమతులు ఇవ్వడం లేదని వారు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా వీటిపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంచే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *