– ఫూలే ఆశయ సాధనలో ప్రతివారూ భాగస్వాములు కావాలి
– జయంతి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి
ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక శ్రీశ్రీ సర్కిల్ వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పూలే జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణంలో ఫూలే కీలక పాత్ర పోషించారన్నారు. ఆ కాలంలో కుల, మత భేదాలు ఉన్న పరిస్థితుల్లో సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. మొదటగా తన భార్య సావిత్రిబాయి ఫూలేకు విద్యాబోధన చేసి ఆమె ద్వారా బాలికల విద్యకు మార్గం సుగమం చేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. కుల వివక్ష కారణంగా అనేక వర్గాల ప్రజలను దేవాలయాలు, పాఠశాలల్లోకి అనుమతించని పరిస్థితులను పూలే ధైర్యంగా ఎదిరించి సమాజంలో మార్పు తీసుకొచ్చారని తెలిపారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని శాస్త్రీయంగా నిరూపించి చిత్తశుద్ధితో ప్రయత్నించిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసని చెప్పారు.
లబ్దిదారులకు చెక్కుల పంపిణీ
ఏదులాపురం : ఎన్నికల వరకే రాజకీయాలని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఆయన పర్యటించి అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆరఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వరంగల్ క్రాస్ రోడ్డు ఆటోనగర్ నుంచి మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వరకు రూ.4.50 కోట్లతో నిర్మించనున్న రహదారి పనులకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 32 వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.58.95 కోట్లు కేటాయించిందన్నారు. ఆటోనగర్ మీదుగా సాగే ఈ రహదారి పూర్తయితే రవాణా కష్టాలు తీరుతాయన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో పేదల ఇళ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు. ‘ప్రజా పాలన మొదటి ఏడాదిలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, త్వరలోనే రెండో విడత ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేశామని, మహిళా సంఘాలకు ఏటా రూ.24 వేల కోట్ల మేర వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని వివరించారు.
లబ్ధిదారులకు బాసట
ఖమ్మం రూరల్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని 64 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను, 227మందికి రూ.70.42 లక్షల విలువైన సీఎంఆరఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, సన్న బియ్యం పంపిణీ వంటి హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్‌బాబు, పాలేరు ప్రత్యేక అధికారి రమేష్, ఆర్డీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.