– మీలా కాక ఫస్ట్‌కే జీతాలిస్తున్నాం
– బకాయిల క్లియరెన్స్‌ను రూ.వెయ్యి కోట్లకు పెంచే యోచన
– బీఆర్ఎస్ ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15వ తేదీ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేవారు.. కానీ తమ ప్రజా ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మొదటి తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేత హరీష్‌రావు తదితరులు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు భట్టి విక్రమార్క సమాధానాలిచ్చారు. బీఆర్ఎస్ పెండింగ్‌లో పెట్టి వెళ్లిన మూడు డీఏలను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల భారం తప్పించుకునేందుకు గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచిందని, నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచిందని, దాంతో 17వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల భారం ప్రజా ప్రభుత్వంపై పడిందని చెప్పారు. ఉద్యోగుల మెడికల్ బిల్లులను మొత్తం క్లియర్ చేశామని చెప్పారు. ఈ విషయంపై సభలో శ్వేత పత్రం విడుదల చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రూ.40,150 కోట్లు బకాయిలు పెట్టిందని, ఆ బకాయిల్లో ఉద్యోగులకు సంబంధించిన బిల్లుల మొత్తం రూ.4,575 కోట్లు ఉన్నాయని, తమ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు ప్రతినెలా రూ.700 కోట్లు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నదని వివరించారు. రాబోయే రోజుల్లో ఆ బకాయిలు త్వరితగతిన క్లియర్ చేసేందుకు రూ.700 కోట్లను రూ.1000 కోట్లకు పెంచాలని విధానపరమైన నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు యావత్ కేబినెట్ సభ్యులకు మానవీయ కోణం ఉన్నందునే ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స కార్డులను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. మీ ప్రభుత్వ కాలంలో పదేళ్లపాటు హెల్త్ కార్డుల కోసం ఉద్యోగ సంఘాలు అడిగి అలసిపోయాయని ఘాటుగా విమర్శించారు. ఉద్యోగి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి రూ.1.25 కోట్ల ప్రమాద బీమాను అమలు చేయబోతున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపు రూ.6,146 కోట్లు క్లియర్ చేశామని, పీఆర్సీ నివేదిక రాగానే పరిశీలించి కొత్త పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులపై ఆంక్షలు ఉండేవి.. తమ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో నిత్యం సంప్రదిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నదని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు ఏ సమయంలోనైనా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసేందుకు పూర్తి స్వేచ్ఛ కల్పించామని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని, వ్యవస్థలు పనిచేయకుండా చేశారని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





