ఆదాయ లక్ష్యాలు అందుకోవాలి

– క్షేత్రస్థాయిలో అన్నింటా పర్యవేక్షణ పెరగాలి
– వాణిజ్య పన్నుల శాఖాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష=

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు కమర్షియల్‌ ట్యాక్స్‌ యంత్రాంగం యావత్తు కృషిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఆ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదాయం కోల్పోతున్న ప్రాంతాలను గుర్తించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు, వ్యాపార లావాదేవీలను కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇకనుంచి ప్రతి 15 రోజులకొకసారి శాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తానని డిప్యూటీ సీఎం తెలిపారు. జీఎస్టీ రేట్‌ రేషనలైజేషన్‌ ద్వారా రాష్ట్రం కోల్పోతున్న ఆదాయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జీఎస్టీ ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించాలని, నిఘా వ్యవస్థ నిరంతరం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని, అధికారుల నిర్లక్ష్యం మూలంగా రాష్ట్ర ఆదాయానికి గండి పడే ప్రమాదం ఉందని అన్నారు. ఉన్నతస్థాయి అధికారులు నిత్యం ఏఐ టెక్నాలజీని వినియోగించుకుని పర్యవేక్షణ సాగించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే లావాదేవీలు, పన్నుల వసూలులో వస్తున్న సమస్యలను అధిగమించడానికి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. గత ఏడాదికి, ఈ సంవత్సరానికి శాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఆడిట్‌ తదితర విభాగాల్లో సాధించిన ప్రగతిని సమీక్షించారు. ఆదాయం పెంచుకునేందుకు శాఖలో అంతర్గతంగా కమిటీలు వేసి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమర్షియల్‌ టాక్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.ఏ.రిజ్వీ, కమిషనర్‌ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్‌ సెక్రటరీ కృష్ణ భాస్కర్‌, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ హరికిరణ్‌, డిప్యూటీ కమిషనర్లు సౌజన్య, వాసవి, సంయుక్తారాణి, సునీత, గీత తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *