మత్తు వీడండి.. మంచిగ జీవించండి

– వ‌రంగ‌ల్‌ సీపీ సన్‌ప్రీత్ సింగ్
– ఎంజీఎం డి-అడిక్షన్ సెంటర్ సందర్శించిన కమిషనర్, కలెక్టర్లు

వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 11 : మత్తు పదార్థాల వ్యసనానికి లోనై తమ బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్న యువతను మళ్లీ సక్రమ మార్గంలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిట‌ల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 40 పడకల డి-అడిక్షన్ సెంటర్ ను వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, చాహత్ బాజ్‌పాయిలతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డి-అడిక్షన్ సెంటర్‌లో అందిస్తున్న చికిత్స విధానాలు, పునరావాస కార్యక్రమాలు, బాధితులకు అందిస్తున్న మానసిక, వైద్య సహాయం త‌దిత‌ర అంశాల గురించి సీపీ, కలెక్టర్లు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులను కోర్టు ఆదేశాల మేరకు ఈ సెంటర్‌కు తరలించి వారికి సమగ్ర చికిత్స అందిస్తూ మత్తు మహమ్మారి నుంచి దూరం చేసి సాధారణ జీవితంలోకి తీసుకువచ్చే చర్యలను అభినందించారు. అలాగే బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారు ఎదుర్కొన్న సమస్యలు, చికిత్స తర్వాత వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మత్తు పదార్థాల వ్యసనం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిచంద్ర రెడ్డి, కేఎంసి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి సెంటర్ కార్యకలాపాలు, చికిత్స విధానాలు, సిబ్బంది సేవలను వివరించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాల నియంత్రణలో పోలీస్ శాఖతో పాటు వైద్య శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే సమాజాన్ని మత్తు వ్యసనాల నుండి రక్షించగలమని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపు కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, వరంగల్ ఏఎస్పీ శుభం, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *