పనితీరే కలెక్టర్లకు గీటురాయి

– 6 నుంచి ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక
– జూన్ 12 వరకు ఐదు దశల్లో కార్యక్రమం
– 99 రోజుల కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలి
– కార్యాచ‌ర‌ణ పూర్త‌య్యేవ‌ర‌కు కలెక్టర్లు జిల్లా వీడొద్దు
– మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సకాలంలో బిల్లుల చెల్లింపు
– కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆలోచనను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉందని మార్గదర్శనం చేశారు. ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయడంతోపాటు ప్రభుత్వ వ్యవస్థలను భవిష్యత్తు అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. సచివాలయంలో మంగళవారం జరిగిన అన్ని జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వ తేదీ వరకు ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను అత్యంత బాధ్యతతో, ఫలితాలపై దృష్టి సారించి అమలు చేయాలని ఆదేశించారు. ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానమని, వారి సర్వీస్ కెరీర్‌కు పునాదిగా నిలుస్తుందని అన్నారు. హోళీ పండుగ శుభాకాంక్షలతో ముఖ్యమంత్రి సమావేశాన్ని ప్రారంభించారు. 99 రోజుల కార్యాచరణలో గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి. విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ హాస్పిటల్‌లను మెడికల్‌ ‌కాలేజీలతో అనుసంధానం చేయాలి. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లులు చెల్లించాలని సీఎం అన్నారు. సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో భేటీ అయ్యారు. సమావేశంలో అధికారులు, కలెక్టర్లకు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్యత అంశాలు, పాలనాపరమైన సంస్కరణలపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.మరోవైపు పలువురు కలెక్టర్లపై సీఎం సీరియస్‌ అయ్యారు. కొంతమంది కలెక్టర్లు జిల్లా హెడ్‌ ‌క్వార్టర్‌ ‌లో ఉండటం లేదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. అలాంటి వారు తమ పని తీరు మార్చుకోవాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 99 రోజులపాటు జిల్లా విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. ఈ గడువులోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలనను పరుగులు పెట్టించాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. 99రోజులపాటు జిల్లాను విడిచి వెళ్లొద్దని సీఎం ఆదేశించారు. రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు సీఎస్‌ ‌కె.రామకృష్ణారావు అనుమతి లేకుండా హైదరాబాద్‌ ‌వస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వేగం పెంచే లక్ష్యంతో ఈ నెల 6 నుంచి జూన్‌ 12 ‌వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరుతో 99 డేస్‌ ‌యాక్షన్‌ ‌ప్లాన్‌ అమలు చేయబోతోందన్నారు. జిల్లాల్లో బాగా పనిచేసిన కలెక్టర్లకు సీఎం గ్రేడింగ్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.  తాజా మీటింగ్‌లో పనితీరు ఆధారంగా కలెక్టర్లకు సీఎం గ్రేడింగ్‌ ఇవ్వనున్నారని, ఆశించిన మేరకు పని తీరు చూపని కలెక్టర్లకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, సీఎస్‌, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.

యాక్షన్‌ ‌ప్లాన్‌ సిద్ధం

ఈనెల 6 నుంచి జూన్‌ 12 ‌వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను నిర్వహిస్తుంది. అయిదు దశల్లో 99 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి నోడల్‌ ‌శాఖ గా వ్యవహరిస్తున్న ప్రణాళిక శాఖ యాక్షన్‌ ‌ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఏప్రిల్‌ 2‌న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ ,ఏప్రిల్‌ 16‌న మండలస్థాయిలో, మే 2న నియోజకవర్గ స్థాయి, మే 22న జిల్లాస్థాయిలో కార్యక్రమాలు ఉంటాయని ఆ శాఖ వెల్లడించింది. జూన్‌ 2‌న రాష్ట్ర ఆవిర్భావ వేడుక నిర్వహించనున్నట్లు తెలిపింది. 10 వివిధ థీమ్‌లతో శాఖల వారీగా 99 రోజుల కార్యక్రమం ఉంటుందని వివరించింది. మొదటి థీమ్‌లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్‌ ‌పైళ్ల క్లియరెన్స్, ‌రెండవ థీమ్‌లో ఆరోగ్యం 3లో అరైవ్‌.. అలైవ్‌, 4‌లో సంక్షేమం, 5లో పిల్లల భద్రత.. డ్రగ్స్ ‌కు అడ్డుకట్ట, 6లో రైతు సంక్షేమం.. వ్యవసాయంపై కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 7లో విద్య, 8లో యువత.. క్రీడలు, 9లో మహిళలు , 10వ థీమ్‌లో పర్యావరణంపై సమావేశాలు జరుగుతాయని తెలిపారు. మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు , 99 రోజుల్లో శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలుంటాయని వివరించింది.  ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్‌ ‌యాప్‌ను తయారు చేశామని వెల్లడించింది .


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *