హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ, ప్రజాతంత్ర : మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాన్ని(Sewing Training Center) మహిళలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇక్కడ ఎంతమంది శిక్షణ పొందుతున్నారని, కుట్టు శిక్షణలో ఎలాంటి యంత్రాలను వినియోగిస్తున్నారని మహిళలను అడిగి తెలుసుకున్నారు. కుట్టు శిక్షణ కేంద్రంలో 45 మంది మహిళలు మెలకువలను నేర్చుకుంటున్నారని, దుస్తుల కుట్టుకు అధునాతన కుట్టు మిషన్ల ద్వారా నేర్చుకుంటున్నట్లు బదులిచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. టెక్స్‌టైల్ పార్కులో ఉపాధి అవకాశం వచ్చినా రాకున్నా స్వయం ఉపాధి ద్వారా సొంత కాళ్లపై నిలబడే అవకాశం లభిస్తుందన్నారు. కుట్టు మిషన్ల కొనుగోలుకు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలని డిఆర్డిఓ మేన శ్రీనుకు కలెక్టర్ సూచించారు.
దామెరలోని కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
దామెర మండల కేంద్రంలోని దామెర కుట్టు శిక్షణ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా కుట్టు శిక్షణ కేంద్రం ట్రైనర్స్, కుట్టు శిక్షణలో మెలకువలు నేర్చుకుంటున్న మహిళలతో కలెక్టర్ మాట్లాడారు. ఈ కుట్టు శిక్షణ కేంద్రం ద్వారా ఇప్పటివరకు ఎంతమంది మహిళలు శిక్షణ పొందారని, కుట్టు శిక్షణలో నైపుణ్యాభివృద్ధిని ఎలా పెంపొందిస్తున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రం ఆవరణలో కలెక్టర్ మొక్క నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మేన శ్రీను, సెర్ఫ్ అడిషనల్ డిఆర్డివో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కల్పన, డిపిఎం రాజేంద్రప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన
ఆత్మకూరులో పురోగతిలో ఉన్న పలు ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. పనుల వివరాలను అధికారులు, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల నిర్మాణానికి ఇసుక, కంకర, సిమెంటు, ఇటుకలు, స్టీల్, తదితర సామగ్రి ఎక్కడ నుండి, ఎంతెంత రేట్లకు తెచ్చుకుంటున్నారని ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి గురించి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, డిపిఎం రాజేంద్రప్రసాద్, ఏపీఎం సుజాత, తదితరులు పాల్గొన్నారు.




