– పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
– అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 27: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గత పదేళ్లలో ఎక్కువ రోజులు తీవ్రమైన చలి కమ్ముకున్నది ఈసారి శీతాకాలంలోనే అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాదాపు నెల రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా నమోదవుతున్నాయి. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆరేడు డిగ్రీలకు పడిపోతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఈసారి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.ఇంట్లో వెచ్చగా, బయట చలిగా ఉంటే… ఆ తర్వాత ఇంట్లో చలి వేస్తోంది, బయటికెళితే మాత్రం కాస్త ఉపశమనం అనిపిస్తోంది. శీతల గాలులు, మన ఇళ్ల గోడలే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర వాయవ్య దిశ నుంచి వీస్తున్న శీతల గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. దీనితో ఇళ్ల కాంక్రీటు గోడలు, శ్లాబులు రాత్రంతా చల్లబడి చలి పెరుగుతోంది. ఇళ్ల గోడలు, శ్లాబ్ నుంచి రోజంతా చల్లదనం వెలువడుతోంది. దీనితో ఇంట్లో చలివేస్తోంది. పై అంతస్తు, ఆపైన ఉండే వారికి శీతలగాలుల ప్రభావంతో మరింత ఎక్కువగా చలి ఉంటోంది. మరోవైపు ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో, గాలిలో తేమశాతం తక్కువగా ఉంటుండటంతో సూర్యకిరణాలు నేరుగా దూసుకొస్తున్నాయి. సూర్యాస్తమయం వరకు ఈ ప్రభావం ఉంటోంది. తర్వాత మళ్లీ బయట చలిపెరుగుతోంది. ఇళ్లలో వెచ్చగా ఉంటోంది. హెచ్‌సీయూ, పటాన్‌చెరు, గచ్చిబౌలి, రాజేంద్రనగర్ వంటి శివారు ప్రాంతాల్లో 6-8 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.తెలంగాణలో జనవరి రెండో వారం నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలు, ఆపైన నమోదవుతాయని వాతావరణ వివరాలు, ముందస్తు అంచనాలు అందించే ‘స్కైమెట్ ’ వెబ్‌సైట్ అంచనా వేసింది. మరో వాతావరణ వెబ్‌సైట్ ఆక్యువెదర్.. జనవరి తొలివారం తర్వాత చలి నుంచి ఉపశమనం ఉంటుందని, నెలాఖరుకల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18-19 మధ్యకు చేరుతాయని పేర్కొంది. ఈనెల 31వరకు తీవ్రమైన చలి పరిస్థితులు కొనసాగుతాయని.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ నిపుణులంతా చెబుతున్నారు. సాధారణంగా 12 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కాంక్రీటు గోడలు, శ్లాబులు ఆ చల్లదనానికి పెద్దగా ప్రభావితం కావు. అంతకన్నా ఎంత తగ్గుతూ పోతే.. అంతగా చల్లబడి, ’ప్రభావం అంతగా పెరుగుతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 8, 9 డిగ్రీలకు తగ్గిపోతే… గోడలు, శ్లాబు నుంచి తర్వాతి రోజంతా చల్లదనం వెలువడుతూనే ఉంటుంది. దానితో బయటికంటే ఇంట్లో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది వానలు ఎక్కువగా కురవడం, ఉత్తర వాయవ్య దిశ నుంచి వీస్తున్న శీతల గాలులతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. గత పదేళ్లలో అతి తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు, ఎక్కువ రోజులు కొనసాగడం ఈసారే చూస్తున్నాం. మరో 10 రోజుల వరకు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం 15 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటోంది.