నాణేలు.. వారసత్వ అధ్యయనాల్లో అగ్రభాగాన నిలవాలి

– నాణేల పరంపరకు దక్షిణ భారతం ప్రసిద్ధి
– వీటి అధ్యయనం అంటే ఆలోచనలను అధ్యయనం చేయడమే
– న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ జాతీయ సెమినార్‌లో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ (నాణేల అధ్యయనం), వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆకాంక్షించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో దక్షిణ భారత దేశ నాణేలు, ఆర్థిక వ్యవస్థ (coinage and economy of southeren india) అనే అంశంపై న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ సొసైటీ గురువారం ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.  వివిధ సంస్థల మధ్య సహకారం పెరగాలి.. యువ పరిశోధకులు అంతర శాస్త్రీయ అధ్యయనాలపై దృష్టి పెట్టాలి.. న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ ముందంజలో నిలవాలి అని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. వారసత్వ ఆధారిత పరిశోధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో రాష్ట్రాన్ని శాస్త్రీయ అధ్యయనం, సంస్కృతి సంరక్షణ, జ్ఞాన ఉత్పత్తిలో కేంద్రీకృత హబ్‌గా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని వెల్లడించారు. దక్షిణ భారతానికి ప్రపంచంలోనే అత్యంత సమృద్ధిగా నాణేల పరంపర ఉందన్నారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు తమ వాణిజ్య నెట్‌వర్క్‌లను నాణేల ద్వారా విస్తరించగా కాకతీయుల నుండి విజయనగర సామ్రాజ్యపు వైభవం వరకు మన ప్రాంతపు నాణేలు ఆవిష్కరణ, కళాత్మకత, నైపుణ్యమైన రాజ్య పాలనకు ప్రతీకగా నిలిచాయని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ నాణేలు మనతో మాట్లాడతాయి.. ఆ కాలపు పన్ను వ్యవస్థలు, ముద్రణ, సాంకేతికత, వాణిజ్య ప్రాధాన్యతలు, రాజకీయ దృక్పథం గురించి ఎన్నో విషయాలను వివరిస్తాయని తెలిపారు. ఈ సదస్సు స్వతహాగానే చరిత్రాత్మకమైనదని, వారసత్వ శాఖ (ఇంతకుముందు పురావస్తు అండ్‌ మ్యూజియం) 114 ఏళ్ల ప్రయాణంలో తొలిసారిగా నాణేలపై జాతీయ సదస్సును నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సామ్రాజ్యాలు ఉదయించడం, ఆస్తమించడం చూసిన ఈ శాఖకు ఇది నిజంగా ఒక అద్భుతమైన మైలు రాయి అని భట్టి కొనియాడారు.

న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ అంటే చేతిలో పట్టుకునే చిన్నచిన్న లోహపు ముద్రల అధ్యయనం మాత్రమే అనిపించవచ్చు కానీ ఒక నాణెం పరిశీలిస్తే అందులో ఒక చిన్న ప్రపంచమే కనిపిస్తుందన్నారు. నాణేలు మన పురాతన ‘కంప్రెస్డ్‌ డేటా’ లాంటివని భావిస్తుంటానని భట్టి తెలిపారు. కొద్ది గ్రాముల లోహంలో ఆ కాలం ఆర్థిక వ్యవస్థ, రాజు ఆశయాలు, సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య మార్గాలు, ధార్మిక చిహ్నాలు, దౌత్య సంబంధాలు అన్నీ నిక్షిప్తమై ఉంటాయన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు జిప్‌ ఫైల్‌ను కనుక్కుంటే దానికి ‘కాయిన్‌’ అన్న పేరు పెట్టేవారేమో అనిపిస్తుందన్నారు. ఈ రోజుల్లో భారత్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో, ఫింటెక్‌ ఆవిష్కరణల్లో ప్రపంచాన్ని నడిపిస్తున్న సమయంలో పద్ధెనిమిది పైసల కన్నా క్యూఆర్‌ కోడ్‌లు ఎక్కువగా కనిపిస్తున్న సమయంలో మన ఆర్థిక ప్రయాణం ఎంత దూరం వచ్చిందో ఈ సందర్భం మనకు గుర్తు చేస్తుందని ఆయన తెలిపారు. నాణేలను అధ్యయనం చేయడం అంటే లోహాన్ని కాదు, ఆలోచనను అధ్యయనం చేయడం అని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. కోటి లింగాలలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన శాతవాహన సీసపు నాణేన్ని కనుగొన్నారు.. చూడడానికి అది సాదాసీదాగా కనిపించేది కానీ లోతుగా చూస్తే అసాధారణమైనదని అన్నారు. ఒక వైపు ఉజ్జయినీ చిహ్నం, నాలుగు చిన్న వృత్తాలు క్రాస్‌ ఆకారంలో, విశ్వ నియమం, నిరంతరతను సూచించే పురాతన భారత వాణిజ్య నెట్‌వర్క్‌లలో విస్తృతంగా ఉపయోగించిన చిహ్నం వంటివి ఉన్నాయన్నారు. మరో వైపు సరస్సు తీరానికి గోడలాగా లేదా స్తూప శైలి రైలింగ్‌ ఆకృతి దక్షిణ భారత బౌద్ధ కళలో కనిపించే ముద్ర అని వివరించారు. ఈ రెండు చిహ్నాల మధ్య ఒక బ్రాహ్మీ లిపి, ఒక శాతవాహన పాలకుడి పేరును సూచిస్తుంది.. నేటి తెలంగాణ ప్రాంతంలో వారి ఉనికికి ఉన్న తొలితరపు ఆధారాలలో ఇదొకటి అని విక్రమార్క వివరించారు. ఇలాంటి చిన్న నాణెం ఏమి చెబుతుంది అంటే.. మొదట తెలంగాణ పరధ్యాన ప్రాంతం కాదు.. డెక్కన్‌ వాణిజ్య వ్యవస్థలో కీలక కేంద్రం అనేది  స్పష్టం చేస్తుందన్నారు. రెండవది రాజకీయ అధికారం, బౌద్ధం, వాణిజ్యం ఇవన్నీ ఎంతగా పరస్పరం అనుసంధానమై ఉన్నాయో చూపుతుందని పేర్కొన్నారు. మూడవది ఈ నాణెం సీసంతో తయారు కావడం. డెక్కన్‌లో లభ్యమయ్యే లోహం మన పూర్వీకులు స్థానిక వనరుల ఆధారంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను ఎంతో నైపుణ్యంగా నిర్మించారనేది సూచిస్తుందని చెప్పారు. ఒక్క నాణెంలోనే రాజకీయాలు, ఆధ్యాత్మికత, లోహశాస్త్రం, కళ, ఆర్థిక వ్యవస్థ వంటి అన్ని అంశాలు ఒకేచోట కలిసిపోయాయన్నారు. ఆధునిక చరిత్రకారుడు ఈ చిన్న లోహపు ముక్క తెలిపే విషయం చెప్పడానికి పేజీల తరబడి రాయాల్సి ఉంటుందన్నారు. అందుకే ఇక్కడున్న పరిశోధకులు, విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఆర్థిక శాస్త్రం, సంస్కృతి, లోహశాస్త్రం, చరిత్ర అన్నీ కలిసే ఈ అద్భుత రంగాన్ని ఎంచుకున్నందుకు సబికులందరికీ అభినందనలు తెలిపారు. మన శాస్త్రానికి, మన పూర్వీకుల చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ సదస్సులు మరింత విలువ తీసుకురావాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. సమావేశంలో తెలంగాణ హెరిటేజ్‌ డైరెక్టర్‌ అర్జునరావు, న్యూ మిస్‌ మ్యాటిక్‌ ఇండియా సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ డి.రాజారెడ్డి, న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ జనరల్‌ సెక్రటరీలు ప్రొఫెసర్‌ పి.ఎన్‌.సింగ్‌, ప్రొఫెసర్‌ బింద దత్తాత్రేయ, డిప్యూటీ డైరెక్టర్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందా ఎన్‌ ఎర్లీ హిస్టారిక్‌ సైట్‌ ఇన్‌ తెలంగాణ, ఆర్ట్‌, ఆర్కిటెక్చర్‌, ఐకోనోగ్రఫీ సాల్వేజ్‌డ్‌ ఫ్రమ్‌ కృష్ణా-తుంగభద్ర వ్యాలీ ఇన్‌ ద స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ, సౌత్‌ ఇండియా ఫానమ్స్‌ 106 యాన్యువల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ఎన్‌ఎస్‌ఐ జర్నల్‌, ఇతర పుస్తకాలను డిప్యూటీ సీఎం భట్టి ఆవిష్కరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *