– బుద్ధనగర్‌లో డ్రెయిన్ సిస్టం పరిశీలన
– డ్రైనేజీ సిస్టంను సరిచేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని సూచన
– బాలుడితో కలిసి కాలనీలో తిరిగిన సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 10: అమీర్‌పేటలోని వరద ప్రభావిత ప్రాంతాలైన బుద్ధనగర్, మైత్రీవనం, పక్కనే ఉన్న గంగూబాయి బస్తీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా పర్యటించారు. ఇటీవల వరద నీరు నిలిచిపోయిన మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద నివారణకు శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. బుద్ధనగర్‌లో డ్రెయిన్ సిస్టంను పరిశీలించి కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ ఎక్కువ ఎత్తులో ఉండటాన్ని చూసి రోడ్డు ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని, వెంటనే డ్రైనేజీ సిస్టంను స్ట్రీమ్ లైన్ చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు. పక్కనే ఉన్న గంగూబాయి బస్తీ కుంటను కొంతమంది పూడ్చి వేసి పార్కింగ్‌కు వినియోగిస్తున్నారని సీఎంకు స్థానికులు పిర్యాదు చేశారు. దీంతో ఆ కుంట ప్రాంతాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఒక ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వరద పరిస్థితిని సీఎంకు వివరించిన బాలుడు
బుద్ధనగర్‌లో ఓ బాలుడిని పిలిచి అతనితో కలిసి సీఎం వరద పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. తాను 7వ తరగతి చదువుతున్నానని, ఇంట్లోకి వరద నీరు వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని ఆ బాలుడు సీఎంకు చెప్పాడు. భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలుడికి ధైర్యం చెప్పారు.





