– యువతను క్రీడల వైపు మళ్లించడమే లక్ష్యం
– క్రీడల్లో తెలంగాణ ప్రపంచంతో పోటీపడాలి
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 2: ఇప్పటివరకు రాష్ట్రానికి క్రీడా విధానం ఏదీ లేనందున చాలా లోతుగా ఆలోచించిే తెలంగాణ క్రీడా పాలసీని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హెచ్‌ఐసీసీ ఫస్ట్ ఎడిషన్ అఫ్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా పాలసీ లేకపోవడం వల్ల యువత పెడదారి పడుతోందని, ఈ మధ్య కాలంలో తెలంగాణలో డ్రగ్స్, గంజాయి కేసులు బాగా పెరిగిపోయాయని, వాటి నియంత్రణకు ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ చైతన్యవంతమైన గడ్డ.. తెలంగాణ ఉద్యమంలో యువత ముందుండి పోరాడారు.. అలాంటి యువత ఇప్పుడు వ్యసనాల బారిన పడుతుండటం దురదృష్టకరమని అన్నారు. క్రీడల్లో తెలంగాణ ప్రపంచంతోనే పోటీపడేలా క్రీడా పాలసీని తీసుకొస్తున్నామని, క్రీడల్లో రాజకీయ జోక్యం తగ్గించడానికి పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో క్రీడా పాలసీ ఉంటుందని. క్రీడలతోపాటు వివిధ రంగాల్లో విజయవంతమైన వారితో బోర్డు ఏర్పాటు చేశామని, ప్రభుత్వం ఈ విషయంలో పరిమితమైన పాత్ర పోషిస్తుందని వివరించారు. 1956లో జరిగిన ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం సాధించిన పుట్‌బాల్ జట్టులో హైదరాబాద్‌కు చెందిన వారు తొమ్మిదిమంది ఉన్నారని గుర్తు చేశారు. అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, రవికాంత్ రెడ్డి, సిరాజ్, నిక్కత్ జరీన్, దీప్తి వంటి అనేకమంది క్రీడాకారులు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. సిరాజ్, నిక్కత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగంతోపాటు హైదరాబాద్‌లో ఇంటి స్థలం ఇచ్చి ప్రోత్సహించామన్నారు. పారా ఒలంపిక్స్‌లో రాణించిన దీప్తికి రూ.కోటి నగదు బహుమతితోపాటు ఇంటి స్థలం ఇచ్చామన్నారు. చదువులోనే కాదు క్రీడల్లో రాణించినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందనే సందేశం ఇచ్చామని గుర్తుచేశారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశానికి ఒలంపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ రాకపోవడం దేశానికే అవమానం. ఒలంపిక్స్ లో దేశానికి 71వ స్థానం రావడం అందరూ ఆలోచించాల్సిన విషయమని, దీన్ని దృష్టిలో ఉంచుకునే క్రీడలకు తెలంగాణను వేదిక చేయడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. విజన్ డాక్యుమెంట్ 2047లో స్పోర్ట్స్ పాలసీకి ఒక చాప్టర్ కేటాయించామని, నేషనల్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ మిలటరీ గేమ్స్ ను నిర్వహించిన చరిత్ర హైదరాబాద్‌కు ఉందని గుర్తుచేశారు. 2026లో ఖేల్ ఇండియా నిర్వహణకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని, ఒలింపిక్స్‌లో రెండు విభాగాల నిర్వహణకు సిద్ధమని కేంద్రానికి తెలిపామని చెప్పారు. తెలంగాణ క్రీడా విధానం కేవలం ఒక కాగితం కాదు.. బంగారు రేకులతో రాసిన పత్రం.. ఒలంపిక్స్‌లో పతకం తేవడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. స్పోర్ట్స్ పాలసీతో రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలు కావాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆయన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీI2025ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రముఖ క్రీడాకారులు గగన్ నారంగ్, అభినవ్ బింద్రా, పలు స్పోర్ట్స్ అకాడమీలు పలు ఒప్పందాలు చేసుకున్నారు. వివిధ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి నగదు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ‘శాట్’ చైర్మన్ శివసేన రెడ్డి, క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడా ప్రముఖులు, క్రీడా సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.





