– ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం
– ఈరోజునాటి బకాయిలు రూ.727 కోట్లే
– బీఆర్ఎస్ బకాయిలు మోస్తూనే పరిమితి పెంచాం
– టీచింగ్ హాస్పిటల్స్‌కు ఆరోగ్యశ్రీ రోగులు
– అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిల వల్ల ప్రైవేటు హాస్పిటల్స్ మూతపడుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన గురువారం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలు మోస్తూనే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. 2023 డిసెంబర్ 7 నాటికి రూ.627 కోట్లు పెండింగ్ బకాయిలుగా తమకు భారం అయిందన్నారు. అప్పటినుంచి ఈ రోజు వరకు రూ.2408 కోట్లను ఆరోగ్యశ్రీ కోసం చెల్లించామని, ఇందులో ప్రభుత్వ హాస్పిటల్స్‌కు రూ.927 కోట్ల్లు, ప్రైవేటు హాస్పిటల్స్‌కు రూ.1480 కోట్లు చెల్లించామని, ఈ రోజు వరకు ఉన్న బకాయిలు రూ.727 కోట్లు మాత్రమేనని వివరించారు. ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయని, గత ప్రభుత్వం ఇచ్చిన బకాయిలే పెండింగ్‌లో ఉంటున్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకునే రోగుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు బకాయిలు చాలా తక్కువగా ఉన్నాయంటూ ఆరోగ్యశ్రీ చెల్లింపులపై అపోహలు కల్పిస్తున్నారని విమర్శించారు. కాగా, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల విషయంలో గతంలో అనేక అవకతవకలు జరిగాయని, కొంతమంది ఈ నిధిని దుర్వినియోగం చేశారని, కేసులు కూడా పెట్టారని, తమ ప్రభుత్వం వచ్చాక ఆన్‌లైన్‌లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీని వల్ల అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని, ఇప్పటివరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2046 కోట్లT ఇచ్చామని, ఆరోగ్యశ్రీ కోసం రూ.2400 కోట్ల ఖర్చు చేశామని, పేదల వైద్యం కోసం రూ.4500 కోట్లను తమ ప్రభుత్వం ఇచ్చిందని వివరించారు. రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలు ఉండగా టీచింగ్ కాలేజీలకు రోగులు రావడం లేదని తెలిపారు. పేదలు వైద్యం కోసం వెళ్లే దగ్గర సరైన డాక్టర్లు లేరు.. అందువల్ల ఆరోగ్యశ్రీ రోగులను టీచింగ్ కాలేజీలకు పంపించే ఆలోచన చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆరోగ్యశ్రీతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్‌ను వీటికి ఇస్తామని, దీనివల్ల ఈ హాస్పిటల్స్ నిర్వహణ మెరుగుపడుతుందని, వీటి నిర్వహణను గ్రూప్-1 అధికారికి ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పారు. కులగణనలో భాగంగా చేసిన జనగణన ఆధారంగా కోటీ 15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా ఇవ్వబోతున్నామని, దీని వల్ల ప్రతి కుటుంబానికి ధీమా కల్పించబోతున్నామని తెలిపారు. మన వాళ్లు వేల మంది డాక్టర్లు విదేశాల్లో పనిచేస్తున్నారని, వారి కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ తయారు చేస్తున్నామని, మన ప్రాంతానికి వాళ్లు వచ్చినప్పుడు ఇక్కడ హాస్పిటల్స్‌లో సేవలు అందించడానికి వెబ్‌సైట్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నామని, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వరంగల్, అల్వాల్, ఎల్‌బీ నగర్, సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్స్‌ను స్పెషలైజేషన్ హాస్పిటల్స్‌గా మారుస్తున్నామని, ఆరోగ్యశ్రీ, సీఎం రీలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చే నిధులను వీటికి కేటాయిస్తామని సీఎం చెప్పారు. గోషామహల్‌లో 30 ఎకరాల్లో రూ.3000 కోట్లతో ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మిస్తున్నామని, అదనంగా 10 వేల పడకలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, టిమ్స్ పనులు వేగంగా చేస్తున్నామని, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ వస్తున్నామని చెప్పారు. దామోదర్ రాజనర్సింహ ఇంజనీర్ అయినప్పటికీ సోషల్ డాక్టర్.. ఆయనకు పేదల కష్టాలపై సంపూర్ణమైన అవగాహన ఉంది.. వైద్యంలో నిరంతరం కొత్త సవాళ్లు ఎదురవుతాయి.. వైద్య ఆరోగ్య శాఖ ఒక సవాల్ లాంటిది. భవిష్యత్తులో అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నాం.. సభ్యులు ఇచ్చే సలహాలను స్వీకరిస్తామని అన్నారు. విద్య, వైద్యం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలు.. విద్య అందుబాటులో ఉన్నా నాణ్యమైన విద్య లేదు.. పేదల విద్య, వైద్యం విషయంలో ఒక్క రూపాయి కూడా కోత విధించం.. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





