– ఏపీ అధికారులతో మాట్లాడాలని సీఎస్‌కు ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: మార్కాపురం బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు మృతిచెందడం, కొందరికి తీవ్ర గాయాలవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ అధికారులతో మాట్లాడి మృతిచెందిన, గాయపడిన వారి పూర్తి వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం సహాయం అందేలా చూడాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఏపీ సీఎస్‌తో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు.
ప్రమాదం కలచివేసింది : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఏపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ప్రైవేట్ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచివేసిందని కేంద్ర మంత్రి జి,కిషన్‌రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
అత్యంత విషాదకరం : కేంద్ర మంత్రి బండి సంజ
ఈ ప్రమాదం అత్యంత విషాదకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా పీఎంఎన్ఆర్‌ఎఫ్ నుండి ఇవ్వనున్నట్లు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి
మార్కాపురం బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న 15 మంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలన్నారు. ప్రైవేట్ వాహనాల భద్రత, రవాణా నిబంధనల అమలుపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఘోర కలి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అత్యంత విషాదకరం : బీజేపీ పక్ష నేత ఏలేటి
మార్కాపురం ప్రమాదంలో 13 మంది మరణం అత్యంత విషాదకరమని బీజేపీ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. 13 మంది మరణించడం, 22 మందికి గాయపడడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ వాహనాల భద్రత, రవాణా నిబంధనలను పక్కాగా అమలు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





