– 80టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రణాళికలు
– చేపట్టాల్సిన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష
– కేంద్ర మంత్రి రాసిన లేఖపై కూడా చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 28 : తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగు నీరు అందించాలని మార్గనిర్దేశం చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర పాత పనులను ఉపయోగించుకుంటూ అంచనాలను తయారు చేయాలని సూచించారు. సుందిళ్లకి మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
సీఆర్ పాటిల్ లేఖపై చర్చ..
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇటీవల రాసిన లేఖపై కూడా ఉన్నతాధికారులతో చర్చించారు. పాటిల్ లేఖలో ప్రస్తావించిన అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా అధ్యయనం చేసి పూర్తిస్థాయి నివేదికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌లపై స్టేటస్ రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితిపైనా సమీక్షలో చర్చించిన ఆయన బ్యారేజీల రిపేర్లకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇందుకు సంబంధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులవారీగా పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సమావేశంలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్‌రాజ్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే