మ‌రోమారు ‘హైడ్రా’ దూకుడు..

  • డైమండ్‌ ఎస్టేట్‌ ‌లే ఔట్‌లో ఆక్రమణల కూల్చివేత
  • కోర్టు తీర్పు మేరకు చర్యలు తీసుకున్న అధికారులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 19 : భాగ్యనగరంలో మరోసారి హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. హైదర్‌నగర్‌ ‌లో ఉద్రిక్తతల నడుమ హైడ్రా కూల్చివేతలు జరిగాయి. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేసారు. దీంతో స్థానికులు, హైడ్రా సిబ్బందికి వాగ్వాదం నెలకొంది. హైదర్‌నగర్‌లో భారీగా పోలీసులు మోహరించారు. కూకట్‌పల్లి పరిధి హైదర్‌నగర్‌లోని డైమండ్‌ ఎస్టేట్‌ ‌లేఅవుట్‌ను ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా విడిపించింది. ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేసిన 79 మంది బాధితులకు న్యాయం చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో 79 మంది బాధితులకు ఈ స్థలం చెందుతుందని హైకోర్టు  తీర్పునిచ్చింది. అయినా కబ్జాదారులు స్థలాన్ని ఖాలీ చేయకపోవడంతో బాధితులంతా హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో  ప్లాట్‌లోని యజమానులను కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైదర్‌నగర్‌లో కూల్చివేతలు చేస్తోంది. దాదాపు 20 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి హైడ్రా పరిష్కారం చూపినట్లు తెలుస్తోంది. తొమ్మిదిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 79 మంది ప్లాట్ల ఓనర్లు హైడ్రాకు మద్దతు తెలిపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా హైదర్‌నగర్‌లో ఈ స్థలాన్ని ఆక్రమించి పార్కింగ్‌ ‌పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి.

ఓ ప్రైవేటు వ్యక్తి ఈ ఆక్రమణలకు పాల్పడటంతో ఆ స్థలం యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 20 ఏళ్లుగా బాధితులు పోరాటం చేస్తున్నారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో హైడ్రా రంగంలోకి దిగింది. ఈ భూమికి సంబంధించి ఎనిమిది నెలల క్రితమే తీర్పు వచ్చినప్పటికీ ప్రైవేటు వ్యక్తి ఖాళీ చేయకపోవడంతో హైడ్రా రంగ ప్రవేశం చేసి కూల్చివేతలు చేపట్టింది. హైదర్‌నగర్‌ ‌నుంచి మియాపూర్‌ ‌వెళ్లే మార్గంలో కూల్చివేతలు కొనసాగాయి. చుట్టూ షెడ్లను నిర్మించి అక్రమ పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ స్థలం అంతా కూడా హెచ్‌ఎమ్‌డీఏ లే అవుట్‌కు చెందినది. ఈ విషయాన్ని హైడ్రా నిర్ధారించింది. హైడ్రా చీఫ్‌ ‌రంగనాథ్‌ ఇటీవల హైదర్‌నగర్‌లో ఆక్రమణలకు గురై స్థలం వద్దకు వచ్చి పరిశీలించారు. డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత హైడ్రా సిబ్బంది ఈరోజు నేరుగా కూల్చివేతలు చేపట్టింది. కూల్చివేతల సమయంలో ఈ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తి హైడ్రా సిబ్బందిని అడ్డుకునేందుకు యత్నించాడు. అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. హైడ్రాకు సంబంధించిన వందలాది మంది సిబ్బందితో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జేసీబీల సహాయంతో పెద్ద ఎత్తున కూల్చివేతలు చేబడుతోంది.

ఇటీవల కాలంలో హైడ్రా పోలీస్‌స్టేషన్‌ ఓపెన్‌ ‌చేసిన తర్వాత మరింత దూకుడు పెంచింది. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉన్నాయనే దానిపై తమ దృష్టికి వస్తే ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకుంటామని హైడ్రా చీఫ్‌ ‌రంగనాథ్‌ ‌చెబుతున్నారు. కూకట్‌పల్లి మండలం హైదర్‌నగర్‌ ‌డివిజన్‌లోని సర్వే నెంబర్‌ 145‌లో 9 ఎకరాల 27 గుంటల స్థలంలో డైమండ్‌ ఎస్టేట్స్ ‌లేఅవుట్‌ ‌విస్తరించింది. ఇందులో మధ్యతరగతి ప్రజలు 79 మంది 2000 సంవత్సరంలో ప్లాట్లు కొనుగోలు చేశారు. అనంతరం ఆ స్థలం తనదని శివ దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తి మరి కొంతమందితో కలిసి ఆక్రమణకు పాల్పడ్డాడు. అనంతరం ప్లాట్ల యజమానులను స్థలంలోకి రాకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకువచ్చారు. దీంతో బాధితులందరూ కోర్టుకు వెళ్లి 2024 సెప్టెంబర్‌లో స్థలాలను దక్కించుకున్నారు. న్యాయస్థానం ప్లాట్ల యజమానులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కబ్జాదారులు  స్థలాన్ని ఖాలీ చేయలేదు. బాధితులను లేఅవుట్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో వారంతా హైడ్రాకు ప్రజావాణిలో గోడును వెలిబుచ్చారు. ఈక్రమంలో హైడ్రా సోమవారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టింది. దీంతో ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *