తుపాకీ సిద్ధాంతం ఇక చెల్లదు..

  • జనజీవన స్రవంతిలోకి రావడమే మార్గం!
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మావోయిస్టు మాజీ అగ్రనేతల కీలక భేటీ
  • రివార్డులు, ఇల్లు, ఉద్యోగంపై సీఎం హామీ..
  • త్వరలో బహిరంగ లేఖ విడుదల:
  • మాజీ మావోయిస్టు దేవ్‌జీ సంచలన వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27 : రాష్ట్ర  రాజకీయ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం మాజీ అగ్రనేత దేవ్‌జీ (అలియాస్ తిప్పిరి తిరుపతి) మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో “తుపాకీ సిద్ధాంతం ఇక నడవదు” అని ఆయన స్పష్టం చేశారు.
లొంగిపోయిన వారి రివార్డు మొత్తాన్ని రూ.కోటికి పెంచాలని కోరారు. పునరావాసం కింద ఒక్కొక్కరికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఐదు ఎకరాల పంపిణీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని సీఎం స్పష్టం చేసినట్లు దేవ్‌జీ తెలిపారు. భూమికి బదులుగా ఇల్లు, ఉద్యోగం, గౌరవప్రదమైన జీవనభృతి కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు.
జైల్లో ఉన్న నేతలతో భేటీకి అనుమతి:
ప్రభుత్వం అనుమతి ఇస్తే ప్రస్తుతం జైళ్లలో ఉన్న మావోయిస్టు నేతలను కలుస్తామని వారు పేర్కొన్నారు. వారితో చర్చించిన అనంతరం, లొంగుబాట్ల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలకు, ఇతర క్యాడర్‌కు ఒక బహిరంగ లేఖ రాస్తామని దేవ్‌జీ ప్రకటించారు. హింసా మార్గం ద్వారా ఆశించిన మార్పు రాదని, ప్రజాస్వామ్య మార్గమే సరైనదని వారు అభిప్రాయపడ్డారు.
సీఎం రేవంత్‌తో భేటీ అయిన వారిలో మాజీ మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, పోతుల కల్పన అలియాస్ సుజాత, బడే చొక్కారావు  అలియాస్ దామోదర్ , నూనె నర్సింహా రెడ్డి  అలియాస్ గంగన్నస‌మావేశ‌మ‌య్యారు.  ఈ స‌మావేశంలో  ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఏడీజీ ఇంటలీజెన్స్ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు.

మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేస్తా

సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి  27 : మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలతో సచివాలయంలో స‌మావేశం  అనంత‌రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్ట పరిధిలో వారు ఏదైనా చేసుకోవచ్చు. చట్టాలు ఉల్లంఘిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేస్తానని వెల్లడించారు. కాగా గతంలో సచివాలయంలోకి మాజీ మావోయిస్టులకు ఎంట్రీ ఉండేది కాదు. కానీ, తాజాగా మాజీ మావోయిస్టు నేతలకు సచివాలయంలోకి సాదర స్వాగతం పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *