ఒక్క పథకం విప్లవాత్మక మార్పులకు కారణమైంది

మహాలక్ష్మి పథకంపై సీఎం రేవంత్‌ పోస్టు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: ఆర్టీసీలో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ పథకం వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు, ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ’ఎక్స్‌‘లో పోస్టు పెట్టారు. ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని పేర్కొన్నారు. కొందరు ఎగతాళి చేసినప్పటికీ ఈ పథకం ఆడబిడ్డల ఆనందకర జీవితానికి ఆలంబన అయిందన్నారు. ఈ పథకం వల్ల ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్కుపెన్సీ 35 నుంచి 60 శాతానికి పెరిగిందని తెలిపారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చే పేద ఆడబిడ్డల సంఖ్య 31 శాతం పెరిగిందనిన్నారు. ప్రజా పాలన ప్రారంభమయ్యే నాటికి ఇక ఆర్టీసీ కథ కంచికే అన్న పరిస్థితి ఉందని, ఇపుడు సంస్థ ఆ కష్టాల నుంచి గట్టెక్కిందని అదే ఆర్టీసీలో పనిచేస్తున్న చెల్లెమ్మలు చెప్పిన వివరాలు తనకు ఎనలేని సంతోషాన్ని కలిగించాయని ఆయన పేర్కొన్నారు. పేదవాడి ప్రగతి రథ చక్రం ఇక చరిత్ర పుటల్లోకి జారిపోతుందనే పరిస్థితి ఉండేదన్నారు. అయినప్పటికీ ఈ ప్రయాణంలో నేడు 200 కోట్ల జీరో టికెట్లతో మహాలక్ష్మి పథకంలో పాలుపంచుకుని ఆర్టీసీకి ప్రాణం పోసిన ప్రతి ఆర్టీసీ ఉద్యోగి, సిబ్బంది, కార్మికులకు, అలాగే సంస్థ యాజమాన్యానికి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం రేవంత్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని ఇకపై కూడా మీరంతా కొనసాగిస్తారని ఆశిస్తున్నానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *