సీఎం రేవంత్ రెడ్డి కర్ణుడేమీ కాదు

– అభివృద్ధికి కేరాఫ్ కేసీఆర్
– విధ్వంసానికి కేరాఫ్ కాంగ్రెస్
– రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టండి
– బీఆర్ఎస్ చొప్పదండి కార్యకర్తల సమావేశంలో హరీష్‌రావు

చొప్పదండి, ప్రజాతంత్ర, మార్చి 7: కేసీఆర్ అభివృద్ధికి కేరాఫ్ అయితే కాంగ్రెస్ సర్కార్ విధ్వంసానికి కేరాఫ్ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. బూతులు మాట్లాడటం మీద సీఎం రేవంత్‌కు ఉన్న ధ్యాస రైతుల కష్టాల మీద లేదన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో శనివారం జరిగిన బీఆరఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆరఎస్‌లో చేరారు. సమావేశానికి ముందు మల్కాపూర్, గోపాలరావుపల్లి గ్రామాల్లో పర్యటించగా కేసీఆర్ ఉన్నప్పుడే మా బతుకులు బాగుండే అని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ఇది కేవలం మల్కాపూర్, గోపాలరావుపల్లి రైతుల మాట కాదు.. యావత్ తెలంగాణ ప్రజల ఆవేదన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. సంక్షేమ పథకాలన్నింటికీ కోత పడింది.. హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో, మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేదల ఇండ్లను కూలగొడుతూ వారి బతుకులను ఆగం చేస్తున్నారు.. కట్టడం చేతకాని రేవంత్ రెడ్డికి కూలగొట్టే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. తనను కర్ణుడితో పోల్చుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణుడు కాదు.. మహా క్రూరుడు. కర్ణుడు మాట తప్పనివాడు.. తన కవచ కుండలాలను సైతం దానం చేసిన త్యాగధనుడు.. కానీ రేవంత్ రెడ్డి పేదల గుండెల మీద తన్నే దుర్మార్గుడు.. ఖమ్మంలో పేదల ఇండ్లు కూలగొడుతుంటే ఆ విధ్వంసం, వారి కన్నీళ్లు చూసి బందోబస్తుకు పోయిన ఒక ఎస్సై సైతం కన్నీరు పెట్టుకున్నాడు. దేశం మొత్తం ఆ వీడియోలు చూసి చలించిపోయింది. కానీ ముఖ్యమంత్రికి మాత్రం కనీసం వీసమెత్తు కూడా బాధ కలగలేదు అన్నారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. కేసీఆర్ 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా ఇచ్చి, చెరువులు బాగు చేసి, పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి వ్యవసాయాన్ని పండుగలా మార్చారన్నారు. రేవంత్ పాలనలో ఇది ఐదో పంట.. కేసీఆర్ ఉన్నప్పుడు సమయానికి అందిన రైతుబంధును రేవంత్ రెడ్డి వచ్చాక మూడు సీజన్ల నుంచి ఎగ్గొట్టిండు అని రైతులు శాపనార్థాలు పెడుతున్నారన్నారు. సకాలంలో మోటార్లు ఆన్ చేయక, చెరువులు నింపక మల్కాపూర్, గోపాలరావుపల్లిలో 500 ఎకరాల పంట కళ్లెదుటే ఎండిపోతోందని తెలిపారు. యూరియా కోసం యాప్‌లు పెట్టి రైతులను బిచ్చగాళ్లను చేశారు. నువ్వు నిజంగా కర్ణుడివే అయితే రైతుబంధు ఎందుకు ఎగ్గొడతావ్.. 24 గంటల కరెంటు, ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయవు అని నిలదీశారు. ఎన్నికల ముందు రైతుబంధు పడుతుందంటావు.. ఎన్నికలు కాగానే ఎగ్గొడతావు. నేను రుణ మాఫీ చేసిన, రైతు బంధు వేసిన.. అవి పడ్డాయో లేదో నాకు తెలవదు అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గొల్ల కురుమలకు గొర్రెలు, ముదిరాజ్‌లకు చేప పిల్లలు ఇచ్చి కేసీఆర్ ఏం ఉద్ధరించిండు అని ముఖ్యమంత్రి అహంకారంతో మాట్లాడుతున్నాడు. కేసీఆర్ తండ్రి లెక్క గొర్రెలు, చేప పిల్లలు, దళితులకు దళితబంధు ఇచ్చి కులవృత్తులను బతికించడంతో పాటు వాళ్ల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో బీసీల కోసం ఏకంగా 119 గురుకులాలు, 30 మహిళా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గొర్రెల పంపిణీ ఆపేసింది. చేప పిల్లలు బంద్ పెట్టింది. గురుకులాల్లో పిల్లలకు కనీసం సరైన అన్నం పెట్టక వాళ్లను దవాఖానాలపాలు చేస్తున్నారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు బంద్ అయ్యాయి. రంజాన్ తోఫాలు బంద్ అయ్యాయి. కేసీఆర్ ఇచ్చిన పథకాలకు కోతలు పెట్టడం తప్ప నువ్వు సాధించిందేముంది రేవంత్ రెడ్డీ అని నిలదీశారు. కేసీఆర్ 1,67,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఏ వర్గానికి ఏం కావాలో అది చేసి పెట్టారన్నారు. 99 రోజుల ప్రణాళిక అంటూ ముఖ్యమంత్రి మళ్లీ కొత్త నాటకానికి తెరతీశారంటూ విమర్శించారు. ఆ 99 అంకె చూస్తుంటే ఎనకట బాటా చెప్పుల ధర గుర్తొస్తోందని వ్యంగ్యంగా ఆయన అన్నారు.. ప్రజా పాలన, రెవెన్యూ సదస్సుల పేరిట గతంలో తీసుకున్న దరఖాస్తులన్నీ అటకెక్కాయి. ఆ దరఖాస్తుల ద్వారా ఏ ఒక్కరికైనా ఒక్క పెన్షన్ ఇచ్చారా.. కేసీఆర్ 57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చారు. దాన్ని రూ.2000లకు పెంచి చూపించారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు వేయడానికి, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు కానీ కేరళ పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చుకోవడానికి, అందాల పోటీలకు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు వందల కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయి.. వంద కోట్లతో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు కట్టుకోవడానికి, కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్ల కోసం రూ.30 వేల కోట్ల బిల్లులు క్లియర్ చేయడానికి పైసలు ఉంటాయి. మూసీ సుందరీకరణ పేరిట రూ.లక్షా యాభై వేల కోట్లు పెట్టి పేదల ఇండ్లు కూలగొట్టడానికి పైసలుంటాయి. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడానికి, రైతులకు రైతుబంధు ఇవ్వడానికి మాత్రం ఖజానా ఖాళీ అంటారు అని హరీష్‌రావు విమర్శించారు. బీసీలు, రైతులు, పేదలపై ఏమాత్రం ప్రేమ లేదు కాబట్టే సంక్షేమ పథకాలను నిలిపివేసి అన్ని వర్గాలను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *