– అందుకే డైవర్షన్ పాలిటిక్స్
– రిజర్వేషన్ల గురించి కాదు.. అభివృద్ధిపై మాట్లాడాలి
– రేవంత్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు
– ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రమాదంపై ప్రభుత్వం ప్రకటన చేయాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేళ్ల మూడు నెలలు పూర్తవుతోంది.. కానీ ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఓటేయాలని ప్రజలను కోరుతున్న తీరు చూస్తున్నామంటూ అసలు శాసనసభ ఎన్నికలకు ముందు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలు, 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల గురించి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా మాట్లాడటం లేదని విమర్శించారు. ఆ హామీల అమలు ఎంతవరకు జరిగిందో చెప్పే ధైర్యం ఆయనకు లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హామీల అమలులో పూర్తిగా విఫలమైన రేవంత్ రెడ్డి తమ అసమర్థత, అవినీతి, అక్రమాల నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తన మంత్రివర్గ సహచరులు వివిధ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల విషయంలో ఎలా కొట్టుకుంటున్నారో ప్రజలందరికీ తెలుసునంటూ ఆ కుమ్ములాటల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామాలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి మతపరమైన రిజర్వేషన్ల గురించి మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ప్రతి ఎన్నికలకు ముందు మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడం, మజ్లిస్ ఓట్లు పొందడం కోసం ఎత్తుగడలు వేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను హైకోర్టు రెండుసార్లు కొట్టివేసింది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంగా తీర్పు ఇచ్చింది. అయినా సుప్రీంకోర్టు స్టేను అడ్డుపెట్టుకుని చట్టబద్ధత లేని 4 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మతపరమైన సమావేశం నిర్వహించి ముస్లింలకు శాశ్వతంగా 4 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడం పూర్తిగా ఓట బ్యాంకు రాజకీయమేనని ఆయన అన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్‌పై కేసీఆర్ ఇంటికి వెళ్లాడు. అప్పుడు బుల్లెట్ నడిపింది ఓవైసీ.. కూర్చున్నది కేసీఆర్. ఈరోజు సీట్లు మారాయి గానీ డ్రైవర్ మారలేదు. బుల్లెట్ నడిపేది ఓవైసీయే, అందులో కూర్చున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలిపే ఆలోచన అని మండిపడ్డారు.
అధికార దుర్వినియోగం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని,. ఎలాంటి విధివిధానాలు లేకుండా, ఆధారాలు లేకుండా, తమ పార్టీ ఎమ్మెల్యేల సూచనల మేరకు డివిజన్ల విభజన చేసి రిజర్వేషన్లను గందరగోళంగా మార్చిందని ఆరోపించారు. మున్సిపాలిటీలకు ఆర్థిక సహకారం ఇవ్వడంలో ఈ రెండు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని, అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి తెలంగాణను రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. హార్వర్డ్ వెళ్లొచ్చినా రేవంత్ రెడ్డిలో బుద్ధి మారలేదని, సంస్కారహీనమైన మాటలు, అడ్డగోలు ఆరోపణలు, రోజుకో కొత్త అబద్ధం, కొత్త వివాదం.. ఇదే ఆయన పాలన అని విమర్శించారు. కాళేశ్వరం అవినీతి విషయంలో తనను ప్రశ్నించే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తానన్న మాటలు ఏమయ్యాయి.. అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌పై ఈగ, దోమ వాలకుండా కాపాడుతున్నారు.. చిత్తశుద్ధి ఉంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.. ఎవరు అడ్డుకుంటున్నారు.. దీనిపై స్పష్టత ఇవ్వాలి అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల అవినీతిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తన వైఫల్యాలకు బాధ్యత తీసుకోకుండా తమ భుజాలపై బందూకు పెట్టి రేవంత్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో కేసీఆర్ కూడా తన అసమర్థతను కేంద్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు.. మాటలతో మభ్యపెట్టి కాలం గడిపేయాలనుకుంటే రేవంత్ రెడ్డిని ఎవ్వరూ రక్షించలేరన్నారు. ముఖ్యమంత్రి పదవికి ఒక గౌరవం, ఒక విలువ ఉంటుంది కానీ ఆ విలువ ఏమాత్రం పాటించకుండా గాలి మాటలతో, బాధ్యత లేని వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకునే ధైర్యం లేకపోతే, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.. కానీ సీఎం పదవిలో ఉండి ఆ బాధ్యతను ఇతరుల మీదకు నెట్టడం సమంజసం కాదన్నారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రమాదంపై అనుమానాలు
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆ ల్యాబ్‌లోని కంప్యూటర్లలో వందలాది కేసులకు సంబంధించిన కీలక డేటా, సాంకేతిక సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ నిల్వ ఉన్నాయని సమాచారం. ఇది అత్యంత తీవ్రమైన విషయం. ముఖ్యంగా ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు వంటి హై ప్రొఫైల్ కేసులకు సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్ అక్కడ ఉందా లేదా అన్నది ప్రభుత్వం వెంటనే ప్రజలకు చెప్పాలి అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉంటే బ్యాకప్ ఉందా లేదనేది ప్రకటించాలి. ఇలాంటి హై లెవల్ కేసులకు సంబంధించిన ఆధారాలు ఒకేచోట ఉండి అదేచోట అగ్నిప్రమాదం జరగడంపై అనేక ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధికారికంగా, బాధ్యతతో స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. హేట్ స్పీచ్ చట్టం కింద చర్యలు తీసుకోవాలనుకుంటే ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే చర్యలు తీసుకోవాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





