పరిశ్రమల అవసరాలకనుగుణంగా శిక్షణ

–  ఏటీసీలపై సమీక్షలో సీఎం సూచనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: పరిశ్రమల అవసరాలకనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌(ఏటీసీ)ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి, అధికారులతో కలిసి ఆయన సోమవారం సమీక్షించారు. నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా వీటి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వీటి అభివృద్ధి, పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం చెప్పారు. రాష్ట్రంలో మూడు దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు, ఫేజ్‌-1లో 25, ఫేజ్‌-2 లో 40, ఫేజ్‌-3లో 46 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపిన అధికారులు ఫేజ్‌-1, ఫేజ్‌-2లో ఇప్పటివరకు 49 అందుబాటులోకి వచ్చాయన్నారు. జీనోమ్‌ వ్యాలీలో ఒక మోడల్‌ ఏటీసీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే కోర్సులు అక్కడ నిర్వహించాలని, అందుకు అవసరమైన స్థలం కేటాయింపుతోపాటు అధునాతన సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వివేక్‌తో కలిసి ఏటీసీ పోస్టర్‌ను ముఖ్యమంత్రి విడుదల చేశారు.

గిగ్‌ వర్కర్స్‌కు చట్టబద్ధమైన గుర్తింపు

గిగ్‌ వర్కర్స్‌ ప్రతిపాదిత పాలసీపై జరిగిన సమీక్షలో గిగ్‌ వర్కర్స్‌కు చట్టబద్ధమైన గుర్తింపు అంశాన్ని పాలసీలో ప్రతిపాదించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీరికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా ప్రతిపాదించారు. ఈ పాలసీపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. గిగ్‌ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని,
సంక్షేమ నిధి ఏర్పాటుతోపాటు ప్రమాద బీమా, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *