– పేదలకు ఓటు హక్కు వద్దన్న ఆర్ఎస్ఎస్ నేతలు
– ఓటు చోర్.. గద్దీ చోడ్ సభలో రేవంత్
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: మహాత్మా గాంధీ, అంబేడ్కర్ రాజ్యాంగ రచన సమయంలో రాజ్యాంగ సభలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలకు ఓటు హక్కు విషయమై చర్చిస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ నేతలు గోల్వాల్కర్ తదితరులు వారికి ఓటు హక్కు ఇవ్వవద్దన్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన దిల్లీలో జరిగిన ఓటు చోర్… గద్దీ చోడ్ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ, అంబేద్కర్ వారికి ఓటు హక్కు కల్పించినందున ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పాటులో వాళ్లు భాగస్వాములవుతున్నారన్నారు. ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్ భావజాలంతో ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారి భావజాలాన్ని అమలుచేసేందుకు 400 సీట్లు కావాలని కోరుకున్నారు. కానీ బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని రాహుల్ గాంధీ చెప్పడంతోనే దేశ ప్రజలు బీజేపీని 240 సీట్లకు పరిమితం చేశారన్నారు. అలా చేయబట్టే ఇవ్వాళ రాజ్యాంగం.. రిజర్వేషన్లు ఉన్నాయి.. అందుకే ఇప్పుడు సర్ పేరుతో ప్రయత్నాలు చేస్తున్నారు. నాడు పేదలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీల కోసం గాంధీ, అంబేద్కర్ నిలబడినట్లే ఇప్పుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నిలుస్తున్నారు.. మనం వారికి అండగా నిలవాలి. సర్ పేరుతో తొలుత ఓటర్ కార్డు తొలగిస్తారు.. తర్వాత ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ తొలగిస్తారు.. వాళ్లకున్న హక్కులన్నీ గుంజుకుంటారు. ఈ సమస్య ఎన్నికలదో… కాంగ్రెస్ పార్టీ దో కాదు దేశ సమస్య.. ఈ సమస్యకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసే పోరాటంలో కలిసి సాగేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది.. దేశ ప్రజలంతా కలిసి రావాలని కోరుతున్నాన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





