– సీఎం రేవంత్‌రెడ్డి ఖండన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: బీహార్‌లో ఓట్ల చోరీని అడ్డుకోవాలని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీలను దిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ప్రజాస్వామ్యయుతంగా ఈసీ కార్యాలయానికి ర్యాలీ చేస్తున్న నేతలను అమానవీయంగా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
బీజేపీపై నిప్పులు చెరిగిన మంత్రి సీతక్క
ములుగు: రామ రాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడమా.. జై శ్రీరాం నినాదాలిస్తూ ప్రజా తీర్పును మార్చి పదవులు పొందడమా అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క బీజేపీని నిలదీశారు. వారు నిజంగా రామ భక్తులైతే ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయట పెట్టాలని సవాల్ చేశారు. ప్రజా తీర్పును దొంగిలించి బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చింది.. ఆధారాలతో బయటపెడితే తట్టుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. హర్యానా, చత్తీస్‌గఢ్‌్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి.. ప్రజా తీర్పు కూడా అదే విధంగా ఉంది.. కానీ దొంగ ఓట్లతో ఫలితాలను బీజేపీ తారుమారు చేసింది అని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ తప్పులను రాహుల్ గాంధీ నిలదీస్తుంటే వారిని అరెస్టు చేస్తున్నారన్నారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన బలమైన ఆయుధం.. కానీ ఇప్పుడు ఆ ఆయుదాన్ని కూడా దొంగిలించి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీకి యావత్ దేశం అండగా ఉందని, బీజేపీ దుర్మార్గపు నిర్ణయాలను గడపగడపకూ తీసుకెళ్లి ఎండగడతామని సీతక్క అన్నారు.




