– త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటాం..
– కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు
– అందరి సూచనల మేరకే చర్యలు
– మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను కేబినెట్ లో ఆమోదించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమవేశంలో మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కెసీఆర్ రీడిజైనింగ్ పేరుతో మార్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన మూడేళ్లల్లోనే మేడిగడ్డ కుంగడం, అన్నారం పగలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఆనాడు కెసీఆర్ కు నిపుణులు నివేదిక అందించారని, రూ.లక్ష కోట్లుపెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోవడంపై.. అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేపడతామని ప్రజలకు ఆనాడు మాట ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం అపార అనుభవం ఉన్న పీసీ ఘోష్ చైర్మన్ గా జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ నియమించామని తెలిపారు. 16 నెలల తరువాత జూలై 31 న 665 పేజీల నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించిందన్నారు. నివేదిక సారాంశాన్ని తయారు చేసి కేబినెట్ కు అందించాలని ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఊరు మార్చి, పేరు మార్చి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం కూలిపోయింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ లో ఆమోదించామని, త్వరలో అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. కమిషన్ ఈ రిపోర్టును బీఆర్ఎస్ తప్పుపట్టడం సహజమే. నివేదిక వారికి అనుకూలంగా ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా మాట్లాడటం వారికి అలవాటేనని ఎద్దేవా చేశారు. కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, ఇది ఇండిపెండెంట్ జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదిక అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందరి సూచనల ప్రకారమే చర్యలు ఉంటాయని, రాజకీయ కక్షపూరిత చర్యలకు పాల్పడబోమని చెప్పారు. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, తదితరులు పాల్గొన్నారు.





