– కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు
– సీఎం రేవంత్ రెడ్డి ఫొటో ఏర్పాటు
– ఇది ప్రజాస్వామ్యంపై దాడి : హరీశ్ రావు
– సీఎం రేవంత్ రెడ్డి గౌరవం కాపాడేందుకే : డిసిసి ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి
– క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ ర్యాలీ
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో వివాదం రాజకీయ అగ్గిని రాజేసింది. కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం ఏర్పాటు అంశం కాంగ్రెస్–బీఆర్ఎస్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసి చివరకు పరస్పర ఆరోపణలు, దాడి వరకు వెళ్ళింది. సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలోకి ప్రవేశించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకోవడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చిన ఆంక్షారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదేళ్లపాటు ఆయన ఫొటోలు ప్రతి కార్యాలయంలో ఉండేవని గుర్తుచేశారు. ఇప్పుడు రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఫొటోను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఇది సీఎం గౌరవానికి సంబంధించిన విషయం అని స్పష్టం చేశారు. ఎంతో నమ్మకంతో గెలిపించిన గజ్వేల్ ప్రజలను కెసిఆర్ గాలికి వదిలేసి ఫామ్ హౌస్‌కే పరిమితమవుతున్నారని ఆరోపించారు. దమ్ము ఉంటే గజ్వేల్‌కు వచ్చి అభివృద్ధి చేసి చూపించాలి, గజ్వేల్ క్యాంప్ కార్యాలయానికి రావాలి అంటూ కేసీఆర్‌కు ఆంక్షారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరింత వేడిని పెంచాయి. కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీల్లా వ్యవహరించి క్యాంప్ కార్యాలయంలోకి చొరబడి కిటికీ అద్దాలు పగలగొట్టారని, ఫర్నిచర్ ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఈ ఘటనపై తీవ్రస్థాయిలో స్పందిస్తూ ప్రతిపక్ష నేత క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి పిరికిపందల చర్య అని అన్నారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని ఆరోపించారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. గూండా రాజ్యం అని అన్నారు. ఈ సంఘటన అనంతరం బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో సిద్దిపేట జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఈ సంఘటనకు మూడు రోజుల ముందు సిద్దిపేట పట్టణంలో సైతం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫొటో ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. పోలీసుల జోక్యంతో బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. సిద్దిపేటలో రాజుకున్న రాజకీయ నిప్పు ఇప్పుడు జిల్లా అంతటా వ్యాపించేలా ఉంది. గజ్వేల్ ఘటన ఫొటో ఏర్పాటు వివాదం మాత్రమే కాదు.. ఇది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మధ్య ఆధిపత్య పోరుకు ప్రతీకగా మారింది. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు రాజకీయ వేడి పెరుగుతున్న సంకేతం, రాబోయే రాజకీయ పరిణామాలకు ఇది నాంది కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





