తక్షణ చర్యలకు సిఎం రేవంత్‌ ఆదేశం

– వ‌ర‌ద ప‌రిస్థితిని స‌మీక్షించిన మంత్రులు
– చాప‌ర్ల‌ కోసం బండి సంజ‌య్ ఆదేశాలు

హైదరాబాద్‌/ క‌రీంన‌గర్‌/ మెద‌క్‌/ ప్రజాతంత్ర,ఆగస్ట్ 28:‌హైదరాబాద్‌ ‌నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాలీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్‌ ‌స్తంభాలు, ట్రాన్స్ ‌ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ ‌కో సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్‌ఎం‌సీ, ఎస్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్‌వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని  ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర పాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న కామారెడ్డి, మెదక్‌ ‌జిల్లాల కలెక్టర్లను అలర్ట్ ‌చేసిన ముఖ్యమంత్రి వెంటనే అక్కడ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేందుకు అన్ని విభాగాల అధికారులు సిద్ధంగా ఉండాలని,  ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాల సాయం తీసుకోవాలని  సీఎస్‌కు ఆదేశాలు జారీచేశారు.

ప‌రిస్థితిని స‌మీక్షించిన మంత్రులు

భారీ వర్షాల నేపథ్యంలో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా తగు  చర్యలు చేపడుతున్నట్టు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీధర్‌ ‌బాబులు స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి భారీ వర్షాల పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు ఆదేశాలను జారీ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పరిస్థితులను సమీక్షించారు. ఈ టెలికాన్ఫరెన్స్ ‌లో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి మాట్లాడుతూ, గత రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నందున మెదక్‌, ‌కామారెడ్డి, నిర్మల్‌, ‌సిరిసిల్ల జిల్లాలకు అదనంగా ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ‌బృందాలను పంపాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల వద్ద విపత్తుల నిర్వహణకు సంబంధించిన నిధులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే మరిన్ని నిధులను కేటాయిస్తామ‌ని మంత్రి స్పష్టం చేశారు. మెదక్‌ ‌జిల్లాలో పోచారం ప్రాజెక్టు డ్యాం పై నుండి నీరు ప్రవహిస్తున్న‌దని, ఈ విషయంలో నదికి సమాంతరంగా ఉన్న కాలువకు గండి కొట్టి నీటిని విడుదల చేసి తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి ఆదేశించారు. ఏవైతే ప్రాజెక్టులు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయో ఆయా పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇం‌జనీర్లు, ఇతర సీనియర్‌ ఇం‌జనీర్లు సంబంధిత ప్రాజెక్టుల నీటి వనరుల చెంతనే ఉండి పరిస్థితులను స‌మీక్షించాల‌ని మంత్రి  ఆదేశించారు.  ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలవకుండా చర్యలు చేపట్టాలని, ముంపుకు గురైన బస్తీలు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహారం మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలలో సహాయకురావాస చర్యలను పర్యవేక్షించడానికి, ఇతర స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టడానికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్టు తెలిపారు.  సచివాలయంలో 24గంటలు కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు చెప్పారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రస్తుత సమయంలో ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కల్గకుండా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా తమకు అండగా ఉంటుందని విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. మెదక్‌ ‌కామారెడ్డి నిర్మల్‌ ‌జిల్లాలకు అదనంగా ఎస్‌ ‌డి ఆర్‌ ఎఫ్‌ ‌బలగాలను పంపిస్తున్నామని, ఇప్పటికే నిర్మల్‌ ‌కామారెడ్డి జిల్లాలో ఎన్టీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని సీఎస్‌ ‌తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకుగాను ప్రత్యేకంగా హెలికాప్టర్లను కూడా పంపించేందుకు చర్యలు చేపట్టామని సిఎస్‌ ‌వివరించారు. ఈ టెలికాన్ఫెన్స్ ‌లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ ‌కుమార్‌, ‌నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ ‌బొజ్జ, పోలీస్‌ ‌శాఖ అడిషనల్‌ ‌డీజీ మహేష్‌ ‌భగవత్‌, ‌ఫైర్‌ ‌సర్వీసుల డీజీ నాగిరెడ్డి, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

సహాయక చర్యలకు చాప‌ర్లు :  బండి సంజ‌య్ ఆదేశాలు

భారీ వ‌ర్షాల‌కార‌ణంగా వ‌స్తున్న వరదల్లో ఉన్నవారిని రక్షించడానికి రాష్ట్రానికి కేటాయించిన మూడు హెలికాప్టర్లు ఎంతకు రాకపోయే సరికి రక్షణ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌ఫోన్‌ ‌చేసి సమాచారం తెలుసుకున్నారు. హెలికాప్టర్లను సిద్ధం చేసినట్లు కేంద్ర రక్షణ శాఖ అధికారులు చెప్పారని తెలిపారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో బాధిత ప్రాంతాలకు చాపర్లు రావడంలో ఆలస్య మవుతోందని వివరించారు. ప్రత్యామ్నాయంగా నాందెడ్‌, ‌బీదర్‌ ‌స్టేషన్ల నుంచి చాపర్లను పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు బండి సంజయ్ ‌తెలిపారు. భారీ వర్షాలతో ఎస్సారెస్పీ, మానేరు నదులకు విపరీతంగా వరద వస్తోందని పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించే పక్రియను రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు. వీలైనంత తొందరగా చాపర్లను పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్‌ ‌కోరారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముప్పు ప్రాంతాల వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.  ప్ర‌భుత్వ స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు కేంద్రం పూర్తిగా స‌హ‌క‌రిస్తుంద‌న్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *