పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు 

– రాహుల్, ఖర్గే, కేసీలతో సీఎం రేవంత్ భేటీ
– ఫలితాలపై నివేదికలు అందజేత

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నేతలకు తెలియజేశారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధ, గురువారాల్లో వేర్వురుగా భేటీ అయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 70 శాతానికి పైగా ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి దక్కాయని, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేదని సీఎం తెలియజేశారు. అందుకు సంబంధించిన నివేదికలను అగ్ర నేతలకు అందజేశారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలు బుధవారం జరిగాయని, శుక్రవారం ఫలితాలు వెలువడనున్నాయని చెప్పారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించనున్నదని ధీమా వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణ మాఫీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేత వంటి కార్యక్రమాల అమలుతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందనిముఖ్యమంత్రి వారికి వివరించారు. ఉద్యోగ నియామకాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు, పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం, చేసిన పనులను వివరించేందుకు సభల ఏర్పాటుతో క్షేత్రస్థాయిలో పార్టీపై పూర్తి సానుకూలత ఉందని అగ్ర నేతలకు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. క్షేత్రస్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడంపై రాహుల్ గాంధీ, ఖర్గే, వేణుగోపాల్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *