మెదక్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లి ఏడుపాయ దుర్గా భవాని అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. అనంతరం జిల్లాకు సంబంధించి 192 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మెదక్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలను కలుపుతూ రూ. 52.76 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం, రూ. 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణం, జిల్లా స్వయం సహాయ మహిళా సంఘాలకు రూ. 100 కోట్లతో బ్యాంక్ లింకేజీ చెక్ అందజేత, రూ. 35 కోట్లతో ఏడుపాయల వద్ద రోడ్డు విస్తరణ, డివైడర్ నిర్మాణం పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.ముఖ్యమంత్రి వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, సురేష్ కుమార్ షెట్కర్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే రోహిత్ రావుతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
మెదక్‌లో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన





