– రూ.50 కోట్లతో సహాయ ఉపకరణాలు పంపిణీ
– అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12ః ఒక కుటుంబ సభ్యునిలా దివ్యాంగులకు భరోసా కల్పించేందుకు తమ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రూ.50 కోట్లు కేటాయించిందని, విద్య, ఉద్యోగాల భర్తీలో వారి కోటాను వారికి కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజాభవన్ లో దివ్యాంగులకు రూ.50 కోట్లతో సహాయక పరికరాల పంపిణీ, చిన్నారుల కోసం బాల భరోసా, వృద్ధుల కోసం ప్రణామ్ డే కేర్ సెంటర్లు అనే నూతన సంక్షేమ పథకాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, దామోదర్ రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్, ఇతర ప్రముఖులతో కలిసి సీఎం సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాం.. పోటీ ప్రపంచంలో తాము వెనకబడ్డామన్న ఆలోచన లేకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తున్నాం అంటూ ఈ అవకాశాలను ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో జీవితంలో ఎదగాలి అని పిలుపునిచ్చారు. బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఎదిగిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి దివ్యాంగులకు ఒక స్ఫూర్తి అని కొనియాడారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్ గా ఒక ట్రాన్స్ జెండర్ ని కార్పొరేటర్ గా నామినేట్ చేయాలని సూచిస్తున్నానన్నారు. తద్వారా వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతుందన్నారు. వయోవృద్ధులకు ప్రభుత్వమే కుటుంబంగా మారి ప్రణామ్ పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతి నెలా జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి నూరు శాతం వైద్యం అందించాలన్నదే తమ విధానమని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ పాలసీని తీసుకురాబోతున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉంది.. ఎవరు ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజా భవన్లో దివ్యాంగులకు రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్‌టాప్‌లు, వినికిడి యంత్రాలు, మొబైల్ ఫోన్లు, ఇతర అత్యాధునిక పరికరాల ఉచిత పంపిణీని దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో సీఎం ప్రారంభించారు.
మాది మనసున్న ప్రభుత్వం : భట్టి
మాది మనసున్న ప్రభుత్వం.. అందుకే సమాజంలోని అన్ని రకాల సమస్యలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ పరిష్కారం చూపిస్తూ ముందుకు వెళుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సంక్షేమం అంటే గతంలో కొన్ని శాఖలకే నిధులు మంజూరు చేసేవారు ..కానీ తమ ప్రభుత్వం దివ్యాంగులతోపాటు అన్ని శాఖల సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పాం.. చెప్పినట్టుగానే దివ్యాంగుల జంట వివాహం చేసుకుంటే ప్రస్తుతం ఉన్న ప్రోత్సాహం రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు పెంచుతూ విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. తమ ప్రభుత్వం కేవలం రెండేళ్లల్లో రూ.100 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. దివ్యాంగులు పదోన్నతి పొందితే ప్రస్తుతం పని చేస్తున్న ప్రాంతంలోనే పోస్టింగ్ ఇవ్వాలని మా ప్రభుత్వం g.o ఇచ్చిందని తెలిపారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి ప్రభుత్వం ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
మానవీయ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాంః సీతక్క
బాల భరోసా స్కీమ్ కింద అంగన్వాడి కేంద్రాల్లోనే చిన్నారుల సమస్యలను గుర్తించి పూర్తిస్థాయిలో చికిత్స అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు. వైకల్యాన్ని ఎదుగుదల లోపాన్ని గుర్తించి ఉచితంగానే శస్త్ర చికిత్సలు చేయిస్తామన్నారు. గతంలో ఈ శాఖకు మంత్రిగా ఉన్న తాను వికలాంగుల ఉపాధి కోసం జాబ్ పోర్ట్ లను ఏర్పాటు చేశామని చెప్పారు. వికలాంగుల మధ్య వివాహం జరిగితే రూ.లక్ష ప్రోత్సాహాన్ని అందించామని, దివ్యాంగులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా వారి ఆత్మగౌరవాన్ని పెంచేలా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం పెద్ద మనసు చేసుకొని రూ.50 కోట్లు దివ్యాంగుల పరికరాల కోసం కేటాయించారంటూ వారి ఆలోచనలకనుగుణంగా దివ్యాంగుల కోసం స్పెషల్ బడ్జెట్ కేటాయించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు ధన్యవాదాలు తెలిపారు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఒంటరి జీవితాన్ని అనుభవించవద్దని వారి కోసండే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, వారిలో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పెంచేందుకు ఈ సెంటర్లు ఉపయోగపడతాయని చెప్పారు.
దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం : మత్రి అడ్లూరి
రాష్ట్రంలో సంక్షేమ పాలనకు నేడు మరో సార్థక అధ్యాయం ఆవిష్కృతమైందని, దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల సంక్షేమాన్ని ప్రభుత్వ ప్రధాన కర్తవ్యంగా తీసుకుని మాటలకే పరిమితం కాకుండా కార్యరూపంలో అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వ సంకల్పానికి నేటి దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిదర్శనంగా నిలిచిందని ఎస్సీ ,ఎస్టీ , దివ్యాంగులు ట్రాన్స్ జెండర్ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా ఒకే ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్ల భారీ నిధులను కేటాయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల మంది అర్హులైన దివ్యాంగులకు రూ.43.22 కోట్ల విలువైన ఉపకరణాలను పంపిణీ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 37 ప్రణామం డే కేర్ సెంటర్లల్లో వృద్ధులకు భోజనం, వినోదం, మానసిక ఉల్లాస కార్యక్రమాలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు భద్రతతో కూడిన సంరక్షణ అందిస్తున్నామని చెప్పారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాల భరోసా పథకం కీలక మైలురాయిగా నిలుస్తోందన్నారు. ఐదేళ్లలోపు పిల్లల వైకల్యాలను ముందస్తుగా గుర్తించి, అంగన్వాడీల ద్వారా గ్రామస్థాయిలో ప్రాథమిక స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బలరామ నాయక్ ,అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సబ్యసాచ్ ఘోష్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరి చందన దివ్యాంగుల శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





