నాకు కొడంగల్‌ ఎం‌తో.. కామారెడ్డి కూడా అంతే

– ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు కట్టిస్తాం
– నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
– ఇబ్బందులు ప‌డ్డ‌ విద్యార్థులకు భరోసా
– జలమయమైన కామారెడ్డి జిఆర్‌ ‌కాలనీలో పర్యటన
– బాధిత ప్రజలతో చర్చించిన సిఎం రేవంత్‌

‌కామారెడ్డి, ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: నేను ఆనాడు చెప్పా.. ఈనాడూ చెబుతున్నా.. నా సొంత నియోజకవర్గం కొడంగల్‌ ‌కు ఎంత సాయం చేస్తానో కామారెడ్డికీ అంతే సాయం చేస్తా అని సీఎం రేవంత్‌రెడ్డి వ‌ర‌ద బాధితుల‌కు భ‌రోసా ఇచ్చారు. కామారెడ్డి తనకు సొంత నియోజకవర్గం లాంటిదని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల‌కు కామారెడ్డి జిల్లా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. భారీ వరదకు కామారెడ్డిలోని పలు కాలనీలు నీట మునిగాయి. వేల ఎకరాల పంట వరదలకు కొట్టుకుపోయింది. వరద బాధితులను పరామర్శించేందుకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి కామారెడ్డి జిల్లాలో గురువారం పర్యటించారు. వరదలకు పూర్తిగా జలమయమైన జీఆర్‌ ‌కాలనీని సందర్శించి వరద బాధితులతో మాట్లాడి వారి సాథ‌కబాధ‌కాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ వర్షం, వరదలతో ఈ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చామని, అధికారులు అప్రమత్తంగా ఉండటం వల్లే ఆస్తి నష్టం జరిగినా ప్రాణనష్టం తగ్గించగలిగామని పేర్కొన్నారు. వరదలు రాగానే క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందిగా ఇన్‌చార్జి మంత్రి సీతక్కను, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎంపీ సురేష్‌ ‌షెట్కర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యేలను ఆదేశించానని, ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేశానని చెప్పారు. అయినప్పటికీ ప్రత్యక్షంగా సమస్యలు తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చానన్నారు. పూర్తి స్థాయి వరద నష్టంతో పాటు మళ్లీ ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానన్నారు. సమస్యల పరిష్కారానికి వంద శాతం ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. వరదల్లో కొట్టుకుపోయిన విద్యార్థుల పుస్తకాలు, ఇతర సామ‌గ్రిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, పశు సంపదను కోల్పోయిన వారికి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ధైర్యంగా ఉండండి.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని వరద బాధితులకు భరోసా కల్పించారు. ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఇండ్లిస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డిలోని ఏ కాలనీ, హౌసింగ్‌ ‌బోర్డ్ ‌కాలనీలో వరద ప్రభావం ఎక్కువగా ఉందని పరిశీలనలో సీఎం గుర్తించారు. తాము పరామర్శించుడు మాత్రమే కాదని సాయం చేస్తామని వరద బాధితుల్లో సీఎం ధైర్యం నింపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలన్నీ వంద శాతం పరిష్కరిస్తామని చెప్పారు. ప్రైవేట్‌ ‌స్కూల్‌ ‌పిల్లలు నష్టపోయి ఉంటే ఆదుకుంటామన్నారు. వందేళ్లలో రానంత వరద వచ్చిందని, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు నాయకులు తోడుగా ఉండాలని, భారీ వరదలకు పోచారం ప్రాజెక్టు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడిందని వరద బాధితులనుద్దేశించి సీఎం రేవంత్‌ ‌ప్రసంగించారు. పంట నష్టంపై నివేదిక రాగానే ఆర్థిక సాయం అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

నష్టాలపై స్థానికులతో చర్చ.. బ్రిడ్జిల నిర్మాణంపై నివేదిక తయారీకి ఆదేశం

వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని, తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ ‌మోహన్‌ ‌బాధితులకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశారని చెప్పుకొచ్చారు. కష్టం వచ్చినప్పుడు అండగా ఉండే వారే నాయకులని తెలిపారు. బుడిగిడ గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న, ఇసుక మేటలు వేసిన పొలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ క్రమంలో తమకు జరిగిన నష్టాన్ని రైతులు వివరించారు. అలాగే లింగంపేట్‌లో బ్రిడ్జి పరిస్థితిని పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. బ్రిడ్జి కమ్‌ ‌చెక్‌డ్యామ్‌ ‌తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. వరదలకు మైనర్‌, ‌మేజర్‌ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేశాం. ప్రత్యక్షంగా కష్టాలను, జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడకు వొచ్చాం. శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగించడానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాం. పంట నష్టపరిహారం అందిస్తాం. రోడ్లు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించాలి. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. కుర్దులో వరదలకు దెబ్బతిన్న ఆర్‌అం‌డ్‌బీ వంతెనను పరిశీలించారు. వరదల సమయంలో వంతెన పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. వరదలతో పేదలు, రైతులు, విద్యార్థులు నష్టపోయారు. విద్యార్థులందరికీ వెంటనే పుస్తకాలు అందజేయాలని ఆదేశించాం. వరదల్లో నష్టపోయిన బీడీ, ఇతర పరిశ్రమ కార్మికులను ఆదుకుంటాం. కొడంగల్‌ ఎలాగో.. నాకు కామారెడ్డి కూడా అలాగే. అధికారుల అప్రమత్తతతో ప్రాణనష్టం జరగలేదు. సహాయక చర్యల్లో నేతలు, అధికారులు పాల్గొన్నారు. పలు శాఖలను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాం. ముంపు ప్రాంత ప్రజలను కలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాం. శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వరదలకు మైనర్‌, ‌మేజర్‌ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుకు దెబ్బతిన్నాయని ఆవేదనను వ్యక్తం చేశారు. కష్టాలకు జరిగిన నష్టాలను చూడడానికే ఇక్కడికి వచ్చామని, శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ఇసుక మేటలు తొలగించుకునేందుకు నిధులు మంజూరు చేస్తామని, కామారెడ్డిలో వరదలకు దెబ్బతిన్న పంటలకు నష్టం పరిహారం అందిస్తామని తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు వరద నష్టాన్ని అంచనా వేయాలని చెప్పారు. వరద బాధితులని పరామర్శించి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్‌ ‌రెడ్డి భరోసా ఇచ్చారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, సలహాదారు షబ్బీర్‌ అలీ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *