కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

– తొమ్మిది నెలల్లో రైల్వే లైన్‌ పనులు మొదలు
– మహిళల పేరుతోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
– ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
– రూ.103 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

కొడంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రంలో ఆర్ధిక అభివృద్ధి ఉంటుందని,వారు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. కొడంగల్‌ నియోజకవర్గంలో రూ.103 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపనలు చేశారు. రూ.5.83 కోట్లతో 28 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, రూ.5.01 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ.3 కోట్లతో 10 పంచాయతీ భవనాల నిర్మాణం, రూ.3.65 కోట్లతో బంజారా భవన్‌ కోసం అదనపు సౌకర్యాలు (కాంపౌండ్‌వాల్‌, డైనింగ్‌ హాల్‌, నీటి సరఫరా, విద్యుదీకరణ), రూ.కోటితో కొడంగల్‌లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌కు శంకుస్థాపన, రూ.1.30 కోట్లతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం, రూ.1.40 కోట్లతో కొడంగల్‌లో స్విమ్మింగ్‌ పూల్‌, రూ.4.91 కోట్లతో కమ్యూనిటీ హాళ్లు, కిచెన్‌ షెడ్లు, ప్రహరీలు, రూ.4.45 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీల నిర్మాణానికి శంఉకుస్థాపనుల రూ.2.95 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రంథాలయ భవనాల ప్రారంభం, రూ.60 కోట్లతో కొడంగల్‌ పట్టణంలో రోడ్డు విస్తరణ, రూ.5 కోట్లతో గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం, రూ.4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్‌లో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని కోటిమంది ఆడపడుచులను గౌరవించే విధంగా నాణ్యమైన చీరలను అందిమన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగే దిశగా ప్రతి సంక్షేమ కార్యక్రమాలను వారి పేరునే చేపడుతున్నామన్నారు. మహిళలకు ఆర్ధిక స్వాతంత్య్రం కల్పించామని, హైటెక్‌ సిటీ శిల్పారామంలో వారు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకునేందుకు స్టాల్స్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆడబిడ్డలు తయారు చేసిన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌ లో అమ్ముకునేందుకు అమెజాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోపాటు మహిళలు పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేసుకోవడం, సోలార్‌ ప్లాంట్స్‌ నిర్వహణను మహిళలకు అప్పగించామని, ఆడబిడ్డలు తయారు చేసిన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముకునేందుకు అమెజాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని, ఆర్టీసీలో అద్దె బస్సులు నడిపించే విధంగా వెయ్యిమంది మహిళలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించుకునేందుకు సహకరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్న బియ్యాన్ని అందిస్తున్నట్లు, అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నట్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. నియోజకవర్గం పారిశ్రామిక, విద్యా రంగాల్లో అభివృద్ధి చెందే దిశగా కృషి చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌ తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. నియోజకవర్గానికి మెడికల్‌, వెటర్నరీ, అగ్రి, పారా మెడికల్‌, నర్సింగ్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఏటీసీలు, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, సైనిక్‌ స్కూల్‌ తీసుకొచ్చామని, విద్య ఒక్కటే తరగని ఆస్తి అని, రాష్ట్ర నలుమూలల నుంచి గొప్ప చదువుల కోసం కొడంగల్‌కు వెళ్లాలి అనేలా ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని, మూడేళ్లల్లో ప్రాజెక్టు పూర్తిచేసి కొడంగల్‌ భూములను కృష్ణా జలాలతో తడుపుతామని సీఎం చెప్పారు. లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ పారిశ్రామికవాడగా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలోనే కొడంగల్‌ ప్రజల డెబ్బై ఏళ్ల కల నెరవేరబోతోందని, మరో తొమ్మిది నెలల్లో రైల్వే లైన్‌ ఏర్పాటు పనులు మొదలు కాబోతున్నాయని, నియోజకవర్గంలో సిమెంట్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోబోతున్నామని, అభివృద్ధిలో నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఒక మోడల్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.మైనారిటీ శాఖ ద్వారా 625మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం నిమిత్తం వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల్లోని కొందరు లబ్ధిదారులకు పౌల్ట్రీ, గొర్రెల ఫామ్‌ ఏర్పాటు నిమిత్తం ఆర్థిక సహాయÊ చెక్కులను ముఖ్యమంత్రి అందజేశారు. కార్యక్రమంలో భాగంగా మహిళా శక్తి పథకంలో భాగంగా మద్దూరు మండల మహిళా సమాఖ్య సౌజన్యంతో నడపనున్న ఆర్టీసీ బస్సును ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు రూ.300 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును కూడా అందజేశారు.

హరేకృష్ణ ఫౌండేషన్‌ కిచెన్‌ షెడ్‌కు శంకుస్థాపన

కొడంగల్‌, కోస్గి, మద్దూర్‌, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌, గుండుమల్‌, కొత్తపల్లి, దుద్యాల మండలాల్లో అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్న హరే కృష్ణ ఫౌండేషన్‌ కిచెన్‌షెడ్‌కు భూమి పూజ చేశారు. అక్షయ పాత్ర ద్వారా 312 పాఠశాలల్లోని 28 వేల మంది విద్యార్థులకు భోజనం అందించనున్నారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పోలీస్‌ హౌసింగ్‌ చైర్మన్‌ గురునాథ్‌ రెడ్డి, శాసన సభ్యులు టి.రామ్మోహన్‌ రెడ్డి, బి.మనోహర్‌ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు రాజేశ్వర్‌ రెడ్డి, విజయకుమార్‌, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీకై జైన్‌, నారాయణపేట కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, జిల్లా అదనపు కలెక్టర్‌ లు లింగ్యా నాయక్‌, సుధీర్‌, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, ‘కడా’ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, అక్షయ పాత్ర ఫౌండేషన్‌ చైర్మన్‌ సత్యగౌడ చంద్రప్రభు దాస్‌ జీతోపాటు వివిద శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page