ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల నిర్వాహ‌కుల‌పై కఠిన చర్యలు

– విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా
– బంద్‌ ‌పెట్టి బ్లాక్‌ ‌మెయిల్‌ ‌రాజకీయాలు చేస్తానంటే ఎలా?
– ఫీజులు ఇష్టానుసారం పెంచి రియింబర్స్‌మెంట్‌పై ఒత్తిడి
– రాజకీయ పార్టీల ఉచ్చులో పడి బెదిరిస్తే ఊరుకునేది లేదు
– ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల తీరుపై సీఎం రేవంత్‌ ‌ఘాటు హెచ్చరిక

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబరు 7: ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు తమాషా చేస్తే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే ఊరుకునేది లేదన్నారు. విద్య అనేది సేవ.. వ్యాపారం కాదని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలు సేవ చేయడం లేదు.. వ్యాపారం చేస్తున్నాయని సీరియస్‌ అయ్యారు. గాంధీ భవన్‌ ‌వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం మాట్లాడారు. విద్యార్థులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్ ‌మెంట్‌పై ప్రైవేటు విద్యాసంస్థలు బ్లాక్‌మెయిల్‌ ‌చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాలేజీలను బంద్‌ ‌చేయించిన వారితో చర్చలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ప్రైవేటు విద్యాసంస్థలు ఇటీవల బంద్‌కు పిలుపునిచ్చాయి. రీయింబర్స్‌మెంట్‌ ‌బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ ‌చేశాయి. లేకపోతే నిరవధిక ఆందోళన చేపడతామని హెచ్చరించాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యాసంస్థలను కొనసాగించడం కష్టంతో కూడుకున్నదని ప్రైవేటు విద్యాసంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు విద్యాసంస్థలపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామన్నారు. మా హయాంలోని బకాయిలు ముందు చెల్లిస్తాం.. గతంలో ఉన్న బకాయిలపై చర్చిస్తామని అన్నారు. బందులతో  విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడొద్దన్నారు. ఇలా చేయడం విద్యార్థులపై ప్రభావం చూపదా అని ప్ర‌శ్నించారు. బకాయిలు ఇవాళ కాకపోతే రేపు వసూలవుతాయి. కాలేజీలు బంద్‌ ‌పెడితే విద్యార్థులు కోల్పోయిన సమయం తిరిగి వస్తుందా అని నిల‌దీశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులకు ఇబ్బంది లేదు.. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి.. రాష్ట్రానికి నెలకు రూ.18వేల కోట్ల ఆదాయం వస్తోంది. జీతాలు, వడ్డీలు, ఇతర ఖర్చులు పోనూ మిగిలేది రూ.5వేల కోట్లే. ఈ ఆదాయంతో రాష్ట్రాన్ని ఎలా నడపాలో చెప్పండి అని అడిగారు. ఏ కాలేజీ ఎంత డొనేషన్‌ ‌వసూలు చేస్తున్నదో నాకు తెలుసు.. కాలేజీలో నిబంధనలు పాటించకపోతే ఎలా? ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటూ పోతే ఎలా? రాజకీయ నేతలు అండగా ఉన్నారని విద్యార్థులతో ఆడుకోవద్దు. అడ్డగోలుగా ఫీజులు పెంచుకుని రీయింబర్స్‌మెంట్‌ అడుగుతున్నారు. కాలేజీలకు అనుమతుల విషయంలో ఎన్నో అక్రమాలున్నాయి.. కాలేజీల యజమానులు ప్రభుత్వాన్నే బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేస్తారా? బీసీ నేత ఆర్‌.‌కృష్ణయ్య కూడా అమాయకంగా వాళ్ల ఉచ్చులో పడ్డారు. కృష్ణయ్య, మందకృష్ణ ముందుకొస్తే మీ చేతికే చిట్టా ఇస్తా.. నాలుగు నెలలు ప్రభుత్వాన్ని మీరే నడపండి అని సీఎం అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *