బాథ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇప్పిస్తామని ప్రకటన
సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 1: పాశమైలారం ఘటన మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడి ఎలాంటి పని చేసుకోలేని స్థితిలో ఉన్న బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడి, తిరిగి పనిచేసుకోగలిగే వారికి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. చనిపోయిన వారి పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, గురుకులాలో సీట్ల గురించి మాట్లాడాలని అధికారులకు సూచించామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం తరఫున వైద్యం అందించే బాధ్యత తీసుకుంటామన్నారు. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంగళవారం మంత్రులు, అధికారులతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్.. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ఇన్ని ప్రాణాలను బలిగొన్న ప్రమాదం ఇంతకుముందు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫైర్, హైడ్రా, డిజాస్టర్, రెవెన్యూ శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 143మంది ఉండగా 58 మంది వివరాలు అధికారుల దృష్టికి వచ్చాయని, మిగతా వారు శిథిలాల కింద ఉన్నారా లేక భయంతో కనబడడంలేదా అనేది స్పష్టంగా తెలియదని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. ఘటనలపై కమిటీ రిపోర్ట్ ఇస్తుందని.. ప్రాథమిక సమాచారం తర్వాత ప్రమాదపై పూర్తి వివరాలు చెబుతామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ చెప్పారు.





